/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/D-Raja-jpg.webp)
Andhra Pradesh: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనపై సీపీఐ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా(D Raja) తీవ్ర విమ్శలు చేశారు. సేవ్ ఇండియా- ఛేంజ్ ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళతామని అన్నారు. శుక్రవారం నాడు తిరుపతిలో సీసీఐ చేపట్టిన బస్సు యాత్ర ముగింపు సభకు డి. రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రూ. 15 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అవినీతిపరులు దోచేశారని ఆరోపించారు. కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలను వదిలి వెళ్ళిపోయారన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ పేరుకే తప్ప.. దేశంలో ఎక్కడా కనిపించడం లేదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చలు జరగడం లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ పేరుతో కాలయాపన చేయడమే తప్ప.. ప్రజల సమస్యలు వారు అస్సలు వినరంటూ ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు డి. రాజా.
జి-20 సమావేశాల పేరుతో మోడీ హడావిడి చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోని వారందరూ ఒకే ఫ్యామిలీ అంటున్న మోడీ.. మణిపూర్ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు రాజా. ప్రజాస్వామ్యాన్ని నరేంద్రమోడీ ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. వన్ నేషన్-వవన్ ఎలక్షన్ అంటే ఏంటో స్పష్టంగా మోడీ చెప్పగలడా..? అని నిలదీశారు. అంబేద్కర్ రాజ్యాంగం గురించి మోడీ తెలుసుకుంటే వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి మళ్ళీ మాట్లాడరని వ్యాఖ్యానించారు. బిజెపి-ఆర్.ఎస్.ఎస్.విధానాలు దేశప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.
ఇదే సమయంలో ఏపీలో పరిస్థితులపైనా తీవ్రంగా స్పందించారు డి. రాజా. ఏపీలో రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్థంగా పనిచేయడం లేదన్నారు. కమ్యూనిస్టులను ప్రజలు నమ్ముతున్నారని, ప్రజల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. అరెస్టులు చేసినా, జైలుకు పంపినా వెనక్కి తగ్గేదే లేదన్నారు. ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామని స్పష్టం చేశారాయన.
ఉదయనిధికి అండగా..
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పేంటని ప్రశ్నించారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఉదయనిధి తలనరికి తీసుకురావాలని చెప్పడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఢిల్లీలో చర్చకు సిద్థం అని స్పష్టం చేశారు. అమిత్ షాతో పాటు ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్థంగా ఉన్నానని అన్నారు. బిజెపి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను వక్రీకరించారని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని బిజెపి నేతలు చదివి ఉంటే సనాతన ధర్మం గురించి అర్థమై ఉంటుందన్నారు.
Also Read: