Donate for Desh - Congress Crowdfunding: కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ బాట పట్టింది. జాతీయోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ప్రారంభించిన ‘తిలక్ స్వరాజ్ ఫండ్’ తరహాలోనే పార్టీ ఖజానాను నింపుకునేందుకు ‘డొనేట్ ఫర్ దేశ్’ పేరిట విరాళాలు సేకరించేందుకు నిర్ణయించింది. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డిసెంబరు 18నుంచి ఈ విధంగా ప్రజల్లోకి వెళ్లనుంది. 2022లో ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ సందర్భంగా కొందరు పార్టీ ప్రతినిధులు ఈ సూచన చేయగా, దానిపై సమాలోచనలు జరిపిన అధిష్టానం ఈ విషయమై నిర్ణయించింది.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘డొనేట్ ఫర్ దేశ్’ పేరిట కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ కోసం కార్యాచరణ ప్రకటించింది. డిసెంబరు 18న పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఇందులో విరాళం అందించే అవకాశముంది. ఈ వివరాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ శనివారం మీడియాతో వెల్లడించారు.
‘డొనేట్ ఫర్ దేశ్’ అనేది ఒక సమీకృత ఉద్యమమని మాకెన్ చెప్పారు. ఇందులో మొదట కాంగ్రెస్ 138వ వార్షికోత్సవం సందర్భంగా విరాళాల సేకరణ ఉంటుంది. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం రూ.138, రూ.1,380, రూ.13,800 వంటి మొత్తాలను కాంగ్రెస్ ఖాతాలో జమ చేయాలని, తద్వారా మెరుగైన భారత్ కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని మాకెన్, కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు కనీసం రూ.1,380 చొప్పున విరాళం అందించాలని సూచించారు.
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 వరకు ఆన్ లైన్ లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని, అనంతరం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రతి బూత్ లోని కనీసం పది ఇళ్లలో విరాళాలు కోరుతారని చెప్పారు. ఆన్లైన్ లో క్రౌడ్ ఫండింగ్ కోసం www.donateinc.in, www.inc.in అనే రెండు ఛానళ్లను రూపొందించామని తెలిపారు. 18ఏళ్ల వయస్సు నిండిన వారంత విరాళం అందించేందుకు అర్హులేనని, ఇచ్చిన వారికి విరాళం ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా నాగపూర్ లో భారీ ర్యాలీ కూడా ఉంటుందన్నారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ కు ఎంతొచ్చాయంటే!
గడిచిన ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్‌కు వచ్చిన మొత్తం రూ.952 కోట్లు. బీజేపీకి వచ్చింది రూ.5,572 కోట్లు. గత లోకసభ ఎన్నికల్లో 421 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అనధికారికంగా ఒక్కో స్థానంలో అభ్యర్ధులకి ఇచ్చే మొత్తం రూ. 5 కోట్ల నుంచి 6 కోట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అయ్యే ఖర్చు కనీసం రూ. 2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ఖజానాలో రూ.952 కోట్లు ఉన్నాయి. మరో మూడు నాలుగు నెలల్లో లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిధుల లోటును భర్తీ చేసుకునేందుకు కాంగ్రెస్ డోనేట్ ఫర్ దేశ్ క్యాంపెయిన్ ప్రారంభించాలని నిర్ణయించింది.