Hyderabad CWC Meeting: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న మోదీ ప్రభుత్వం.. కేంద్రంపై చిదంబరం ఫైర్..

సనాతన ధర్మం అంశంపై సిడబ్ల్యూసి మీటింగ్‌లో ఎలాంటి చర్చ జరుగలేదని పి. చిదంబరం తెలిపారు. సనాతన ధర్మం అంశాన్ని వివాదాల్లోకి లాగడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. తాము 'సర్వ ధర్మ సమా భవ' కు కట్టుబడి ఉంటామని, దానినే తాము విశ్వసిస్తామని అన్నారు చిదంబరం.

New Update
Hyderabad CWC Meeting: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న మోదీ ప్రభుత్వం.. కేంద్రంపై చిదంబరం ఫైర్..

Hyderabad CWC Meeting: రాజ్యాంగాన్ని దెబ్బతీస్తూ.. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే(NDA Govt) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్(Congress) సీనియర్ నేత పి. చిదంబరం. ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకు సవాల్‌గా మారాయన్నారు. ఫెడరలిజం క్రమపద్ధతిలో నిర్వీర్యం చేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారాయన. శనివారం హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం తొలిరోజు జరిగిన చర్చల వివరాలను పి. చిదంబరం మీడియాకు వెల్లడించారు. జాతి కలహాలకు వేదికగా మారిన మణిపూర్‌లో పర్యటించడానికి ప్రధాని నరేంద్ర మోదీకి కనీసం రెండు గంటల సమయం కూడా దొరక్కపోవడం నిజంగా ఆశ్చర్యమేసిందని విమర్శలు గుప్పించారు చిదంబరం.

'దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు.. రాజ్యాంగ, సమాఖ్య నిర్మాణానికి సవాలుగా మారాయి. ఫెడరలిజం క్రమపద్ధతిలో బలహీనపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండి కొట్టారు. వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు.' అని కేంద్రం తీరును తూర్పారబట్టారు చిదంబరం. ఇందుకు ఉదాహరణగా కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లను పేర్కొన్నారు. కర్ణాటక ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని భావిస్తే.. కేంద్రం అందుకు మోకాలడ్డిందని ఆరోపించారు. కేంద్రం సూచనల మేరకే ఎఫ్‌సిఐ కర్నాటక ప్రభుత్వం తీసుకువచ్చిన పథకానికి బియ్యం ఇవ్వడానికి నిరాకరించిందన్నారు. ఇంతకు ముందు దేశంలో ఎన్నడూ ఇలా జరుగలేదన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు విపత్తు నిధులు మంజూరు చేయడంలేదని, ఇందుకు కారణం ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోవడమే అని వ్యాఖ్యానించారు చిదంబరం. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినందుకే.. ఎలాంటి నిధులు మంజూరు చేయడంలేదని, సహాయ సహకారాలు కూడా అందించడం లేదని ఆరోపించారు ఈ మాజీ కేంద్రమంత్రి.

మణిపూర్ అంశంపై మౌనం..

'మే 5వ తేదీ నుంచి మణిపూర్ మండుతోంది. అనేక దేశాలను సందర్శించడానికి, ఆసియాన్ సదస్సుకు హాజరయ్యేందుకు, ఆపై G20 సదస్సు కోసం తిరిగి రావడానికి ప్రధాని మోదీకి సమయం దొరికింది. కానీ, తీవ్రమైన విధ్వంసకాండతో రగిలిపోతున్న మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రధాని మోదీకి కనీసం రెండు గంటలు కూడా సమయం దొరక్కపోవడం ఆశ్చర్యంగా ఉంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మణిపూర్ గురించి రెండు నిమిషాల ప్రస్తావించారు తప్ప.. మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.' అని తీవ్ర విమర్శలు చేశారు చిదంబరం. కశ్మీర్‌లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, నిరుద్యోగం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోందని అన్ని సూచీలు హెచ్చరిస్తున్నయన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు చిదంబరం. మోడీ ప్రభుత్వంలో దేశం దశాబ్దాల వెనక్కి వెళ్తోందన్నారు. చైనా దేశ భూభాగాన్ని ఆక్రమిస్తుంటే మోడీ మాత్రం కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిదంబరం.

సనాతన ధర్మంపై..

సనాతన ధర్మం అంశంపై సిడబ్ల్యూసి మీటింగ్‌లో ఎలాంటి చర్చ జరుగలేదని పి. చిదంబరం తెలిపారు. సనాతన ధర్మం అంశాన్ని వివాదాల్లోకి లాగడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. తాము 'సర్వ ధర్మ సమా భవ' కు కట్టుబడి ఉంటామని, దానినే తాము విశ్వసిస్తామని అన్నారు చిదంబరం. అనేక దశాబ్ధాలుగా కాంగ్రెస్ విశ్వాసం అదేనని, ఈ విషయంలో ఎలాంటి వివాదాలకు పోమని క్లారిటీ ఇచ్చారు చిదంబరం.

వన్ నేషన్ వన్ ఎలక్షన్..

ఇదే సమయంలో 'ఒక దేశం - ఒకే ఎన్నికలు' అంశంపై చిదంబరం తీవ్రంగా స్పందించారు. ఇది రాజ్యాంగంపై దాడి చేయడమే అని అన్నారు. ఈ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇది ఫెడరలిజంపై దాడిగా అభివర్ణించారు. ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ రాజ్యాంగ సవరణలు చేయడానికి బీజేపీకి సరిపడా బలం లేదని వ్యాఖ్యానించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ఒక దేశం - ఒకే ఎన్నిక అనే ఎండమావిని ముందుకు తీసుకువస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై చిదంబరం విమర్శలు గుప్పించారు.

సిడబ్ల్యూసి భేటీలో చర్చ ఇదే..

దేశంలోని రాజకీయ పరిస్థితులతో సహా ముసాయిదా తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చిస్తోందని మాజీ హోంమంత్రి చెప్పారు. 'చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశంలోని పరిస్థితులపై చర్చిస్తున్నాం. రాజకీయ పరిస్థితులు, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, అంతర్గత, బాహ్య భద్రతా బెదిరింపులు దేశానికి పెద్ద సవాలుగా మారాయి.' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై అదివారం సిడబ్ల్యూసీ చర్చిస్తుందని మరో ముఖ్య నేత జైరాం రమేష్ తెలిపారు.


Also Read:

Breaking: RTV, NTV జర్నలిస్టులపై ఎమ్మెల్సీ చల్లా గూండాల దాడి

Telangana Liberation day: రజాకార్లపై పోరాటానికి ముందు పాక్‌ ప్రధానికి నెహ్రు టెలిగ్రామ్‌.. నిజాం పీడవదిలిన రోజు!

Advertisment
Advertisment
తాజా కథనాలు