గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. ఇందుకోసం సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో హైకమాండ్ ఏర్పాటు చేసిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ గాంధీ భవన్ లో అభ్యర్థులు, ముఖ్య నేతలతో రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ కమిటీ ఎదుట హాజరైన సీనియర్ నేత, నాంపల్లి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఫిరోజ్‌ఖాన్ ఊహించని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎంఐఎంతో రహస్య పొత్తు వల్లే కాంగ్రెస్ ఓటమి పాలైందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్‌లో కూడా పార్టీని ఇదే అంశం దెబ్బకొట్టిందని ఆయన తెలిపినట్లు తెలుస్తోంది. ఎంఐఎంతో కాంగ్రెస్ రహస్య పొత్తే బీజేపీ బలపడటానికి కారణని ఆయన కురియన్ కమిటీ ముందు తేల్చిచెప్పినట్లు సమాచారం.
హిందువులు దూరం అవడం వల్లే పార్టీకి ఓటమి పాలైందని ఆయన వివరించినట్లు విశ్వనీయవర్గాల నుంచి తెలుస్తోంది. అసదుద్దీన్ సంప్రదింపులతో పార్టీ హైదరాబాద్ లో డమ్మీ అభ్యర్థిని పోటీకి దించిందని.. దీంతో ఒక్కడ ఓడిపోయామని ఫిరోజ్ ఖాన్ చెప్పినట్లు సమాచారం.