తన సొంత నియోజకవర్గం జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలోకి చేర్చుకోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తానని ఆయన నిన్న ప్రకటించారు. నేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు తదితరులు చర్చలు జరిపినా ఆయన శాంతించలేదు. దీంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. తమ దూతగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీకి జీవన్ రెడ్డితో చర్చలు జరపాలని ఆదేశించింది.
అయితే.. దీపాదాస్ మున్షి ఈరోజు జీవన్ రెడ్డితో జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. తనకు రాజ్యసభ సీటుకు హామీ ఇవ్వాలని చర్చల్లో జీవన్ రెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే.. జీవన్ రెడ్డి పెట్టిన ఈ డిమాండ్ పై మున్షీ సీరియస్ అయినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేమంటూ దీపాదాస్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో మనస్థాపానికి గురైన జీవన్ రెడ్డి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు జీవన్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.