Congress On Exist Polls: నేటితో లోక్ సభ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించనున్నాయి. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయనే అంచనాను వెల్లడించనున్నాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్ లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది.
ఊహాగానాలకు, వాదోపవాదాలకు చోటివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ ప్రతినిధి పవన్‌ఖేరా ప్రకటన చేశారు. 4 నుంచి ఏ డిబేట్‌లో పాల్గొనేందుకైనా సిద్ధం అని ప్రకటించింది. ఛానెల్స్ టీఆర్‌పీ పెంచడం కోసం అర్థంలేని ఊహాగానాలు చేయాల్సిన పనేముందంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రజల కోసం ఏ చర్చలైనా ఉపయోగపడాలని పేర్కొంది. ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో ఉందని ఎన్ని చర్చలు పెట్టినా ఆ నిర్ణయాన్ని మార్చలేం అని తెలిపింది. అలాంటప్పుడు ఊహాగానాలను ప్రచారం చేయడమెందుకు అని నిలదీసింది.
కాంగ్రెస్ ప్రకటనపై బీజేపీ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం ఓటమిని అంగీకరించినట్టే అని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఐతే ఈసారి ఇండియా కూటమిదే విజయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్డీఏ కూటమిలోని కొన్ని పార్టీలు కూడా తమతో చేతులు కలుపుతాయని హస్తం పార్టీ పేర్కొంది. స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. రాజస్తాన్, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈసారి తమకే ఎక్కువ సీట్లొస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.