కాంగ్రెస్‌తో బీసీలకు ఒరిగేదేం లేదు.. అక్కడంతా రెడ్డి దొరల రాజ్యమే..

తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్డి దొరల రాజ్యం నడుస్తోంది. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అన్ని వర్గాలుంటేనే కాంగ్రెస్‌ జన బలగం.. కాకుంటే అది జలగల బలగమే.. కాంగ్రెస్‌కు నష్టం జరగాలని నేను కోరుకోవడం లేదు. బీసీలకు మంచి జరగాలనే వేరే పార్టీలోకి వెళుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌..

New Update
కాంగ్రెస్‌తో బీసీలకు ఒరిగేదేం లేదు.. అక్కడంతా రెడ్డి దొరల రాజ్యమే..

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్డి దొరల రాజ్యం నడుస్తోందని.. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఉద్యమకారుడు, నల్లగొండకు చెందిన సీనియర్‌ నాయకుడు చెరుకు సుధాకర్‌ అన్నారు. శుక్రవారం నాడు ఆయన ఆర్‌టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. గెలుపు గుర్రాలు అనే ఒక అమానవీయమైన మాట చెప్పి బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ తీరని అన్యాయం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తోందని, బీసీల కోసం ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ చేసిందని, అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయించిందని తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నాయకులు ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని మండిపడ్డారు. టీ కాంగ్రెస్‌ అగ్రనేతలు భూస్వామ్యవాదంతో ముందుకు వెళుతున్నారని, కొందరు వాళ్ల కుటుంబాలు, కులాల కోసమే పనిచేస్తున్నారన్నారు. బీసీ నేతలు తెలంగాణ కోసం ఎంతో కొట్లాడారని.. కానీ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరు స్టేజీపై.. మేము కింద కూర్చోవాలా..?

మేం బీసీలకు 12 సీట్లు ఇచ్చామని కోమటిరెడ్డి లాంటి నేతలు అనడం సిగ్గుచేటన్నారు. కుర్చీలాట ఉద్యమకారులకు చేతకాదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి లాంటి వ్యక్తి ఎంపీగా కూడా పనికిరాడని తాను గతంలోనే చెప్పానని.. కానీ ఆయనను తీసుకెళ్లి ఎన్నికల కమిటీలో వేశారని మండిపడ్డారు. కోమటిరెడ్డికే మనోభావాలుంటాయా? మాకు ఉండవా? అని ప్రశ్నించారు. కనీసం టికెట్‌ ఇచ్చే ముందు తనతో చర్చించలేదని.. బీసీలంటే మరీ అంత చులకనా? అని ప్రశ్నించారు. నా స్థాయిని కాంగ్రెస్‌ నేతలు కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదని, నాకు నల్గొండ ఇవ్వనప్పుడు ఇంకో స్థానం ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. నల్లగొండలో సభ జరిగితే రెడ్డి నాయకులంతా స్టేజీ మీద నిలబడ్డారని.. తాము మాత్రం కింద నిలబడ్డామని.. అంటే మీరంతా స్టేజీపై నిలబడాలి.. మేమేమో స్టేజీ కింద నిలబడాలా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలుంటేనే కాంగ్రెస్‌ జన బలగం.. కాకుంటే అది జలగల బలగమేనని ఎద్దేవా చేశారు.

బీసీ సీఎం కోసం పోరాడుతాం..

నేనిప్పుడు బీఆర్‌ఎస్‌లోకి వెళితే కనీసం నాకిప్పుడు న్యాయం జరగకపోయినా ఉద్యమకారులకు ఏదైనా చేసే అవకాశం ఉంటుందని చెరుకు సుధాకర్‌ తెలిపారు. ఇప్పటికీ దేశంలో మోదీ అరాచక పాలనపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తున్న నేపథ్యంలో మున్ముందు ఆ పార్టీకి మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. అలాగే యూపీఏ ప్రభుత్వం వస్తే బీఆర్‌ఎస్‌కు ఇప్పటికంటే మంచి ప్రయోజనమే చేకూరుతుందనేది తన నమ్మకమని తెలిపారు. కాంగ్రెస్‌కు నష్టం జరగాలని నేను కోరుకోవడం లేదని, బీసీలకు మంచి జరగాలనే వేరే పార్టీలోకి వెళుతున్నానని తెలిపారు. సామాజిక న్యాయం జరగకపోతే ఆ పార్టీలో కూడా ఎక్కువకాలం ఉండనని చెరుకు సుధాకర్‌ అన్నారు. తెలంగాణలో ఒక్క కేసీఆర్‌నే దొర అనడం సరికాదని.. కాంగ్రెస్‌లో ప్రతి నియోజకవర్గానికి ఒక దొర ఉన్నాడన్నారు. వీళ్లని కాదని ముందుకు పోయేదేమీ లేదన్నారు. రేవంత్‌ గొప్ప లీడర్‌ కావాలనుకుంటే.. పొన్నాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, ఏ నాయకుడికైనా అతి భాష మంచిది కాదని అన్నారు. ఎవరైనా బీసీ నాయకులు నాతో పాటు వస్తే వారికి కూడా బీఆర్‌ఎస్‌లో స్పేస్‌ కల్పించే ప్రయత్నం చేస్తానన్నారు. రాహుల్‌ దేశానికి ఒక గొప్ప స్టార్‌ లీడర్‌ కావాలంటే పార్టీలో ఉన్న ఫ్యూడలిజాన్ని తగ్గించాలని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరిగేది బయట వ్యక్తి కంటే కూడా లోపల ఉన్న అహంకారులు, ఫ్యూడలిస్టుల వల్లేనని తెలిపారు. ఇప్పటికైనా దాన్ని సరిచేసుకుంటే తప్ప వెళ్లిపోయే బీసీ నేతలను ఎవరూ ఆపలేరని, నాతో మొదలు కాదు.. చివరిది కాదన్నారు. బీసీ ముఖ్యమంత్రి అనేది ఆయాచితంగా దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదని, ఇప్పటికైనా అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు రియలైజ్‌ అయి బీసీ సీఎం నినాదాన్ని అందుకోవాలన్నారు.

Advertisment
తాజా కథనాలు