Anaparthi: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పొత్తుల టిక్కెట్ పై గందరగోళం నెలకొంది. మొదట టీడీపీ అధిష్టానం నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీ నేత శివరామ కృష్ణంరాజుకి కేటాయించడంతో టీడీపీ నుండి నిరసన సెగలు తగులుతున్నాయి.
న్యాయం కావాలని..
నల్లమల్లికి న్యాయం జరగాలని నియోజవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. తన తండ్రి ఫొటో పెట్టుకుని .. రిక్షాలో తల్లిని ఎక్కించి కుటుంబ సభ్యులతో నల్లమిల్లి పలు గ్రామాలు తిరిగారు. రాష్ట్రవ్యాప్తంగా తనకు న్యాయం కావాలంటూ ప్రచారానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నిన్న నల్లజర్లలో జరిగిన రాజమండ్రి పార్లమెంట్ సమావేశానికి చంద్రబాబు నుంచి రామకృష్ణారెడ్డికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నల్లమిల్లి చంద్రబాబును కలిసి జరుగుతున్న పరిణామాలను ప్రజల నిర్ణయాన్ని తెలిపారు.
Also Read: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత!
సానుకూలంగా..
చంద్రబాబుతో సమావేశం అనంతరం బయటకు వచ్చిన నల్లమిల్లి అధిష్టానం తనకు సానుకూలంగా ఉందని, అనపర్తి నుంచి టీడీపీనే పోటీ చేస్తుందని వెల్లడించారు. టికెట్ తనకే కేటాయిస్తారని ఆందోళన చెందవద్దంటూ తన అభిమానులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని సీటు తిరిగి తనకే దక్కుతుందని నల్లమిల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
సీటుపై ఉత్కంఠ
అయితే, పొత్తుల్లో సీటు బీజేపీకి ప్రకటించిన తర్వాత మార్పు ఎలా జరుగుతుందోనని ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివరామకృష్ణంరాజు స్పందించారు. అధిష్టానం నుండి తనకు ఎటువంటి సమాచారం రాలేదని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బరిలో తానే ఉన్నానని శివరామకృష్ణంరాజు అంటున్నారు. పార్టీ నిర్ణయం ఎలా తీసుకుంటే ఆ విధంగా తాను ముందుకు వెళ్తానని తెలిపారు.