పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సీఎం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావొస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరిలో ముగిసిన పదవీకాలం..
ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించింది ప్రభుత్వం. ఈ నెల 4తో ఎంపీటీసీలు, జడ్పీటీసీల టర్మ్ ముగిసింది. మండల పరిషత్ ల బాధ్యతలను ఎంపీడీఓ పై ర్యాంక్ అధికారులకు, జిల్లా పరిషత్ ల బాధ్యతలను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది. వచ్చే నెలలోనే పంచాయతీలకు కొత్త సర్పంచ్ లు రానున్నారు.
కొత్త చట్టం తెచ్చిన కేసీఆర్ సర్కార్..
గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొత్త చట్టం తీసుకువచ్చింది. రెండు టర్మ్ లు ఒకే రిజర్వేషన్ ఉండాలని ఆ చట్టంలో పొందు పరిచింది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒకే సారి మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అదే రిజర్వేషన్లను కొనసాగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. దీంతో రిజర్వేషన్లపై ఎవరూ కోర్టును ఆశ్రయించే అవకాశం లేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను సైతం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రేవంత్ వ్యూహం ఇదే..
ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనపడడం, బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచినా గ్రామ స్థాయిలో ఆ పార్టీకి బలం లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమని ఆ పార్టీ అంచనా వేస్తోంది. మరోవైపు ఎన్నికలన్నీ పూర్తయితే ఇక పాలనపై పూర్తి ఫోకస్ పెట్టాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.