CM Revanth Reddy: ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని అన్నారు. అన్నింటిపై సీబీఐ విచారణ కోరే కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్‌పై (Phone Tapping) ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదు.. అలాంటి పనులు చేయనని స్పష్టం చేవారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యత అందెశ్రీకే అప్పగించామన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందెశ్రీ నిర్ణయానికే వదిలేశామన్నారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం అని అన్నారు.
తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తుకు వస్తాయన్నారు. కాళేశ్వరంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామన్నారు. నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరంపై నిర్ణయాలు ఉంటాయన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు, కరెంటు కోతలు లేవన్నారు. కొన్ని చోట్ల వర్షం కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు.
పక్క రాష్ట్రం ఏపీలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫర్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్ లేకుండా ఎన్నికల ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఎన్నికలు జరిగాయన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణం లో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించామన్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామన్న ఆరోపణలు ప్రతిపక్షాలు సైతం చేయలేదన్నారు.