మూడు దఫాలుగా రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. రేపు లక్షలోపు, నెలాఖరలోగా లక్షన్నరవరకు, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగిన టీసీపీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 4 గంటల వరకు రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ జరుగుతుందన్నారు. రూ. 7 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు.
ఆగస్టులో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమన్నారు రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ హామీ రాహుల్ గాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్ మాట ఇస్తే అమలు చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అని నాయకులకు సూచించారు. వ్యవసాయ విధానంలో తెలంగాణను దేశం అనుసరించాలన్నారు.
రుణమాఫీ పేరుతో కేసీఆర్‌లా రైతులను మభ్యపెట్టడం లేదన్నారు. మనం చేస్తున్న ఈ మంచి పనిని ప్రజలకు వివరించాలని నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు. రుణమాఫీపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు. పార్లమెంట్‌లోనూ రుణమాఫీపై ఎంపీలు ప్రస్తావించాలని సూచించారు.