CM Jagan tweet on Vijayanagaram train accident: ఏపీ సీఎం జగన్ నేడు విజయనగరం జిల్లా రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. రైళ్లు ఢీకొన్న ఘటన స్థలిని హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు.
గత రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనకు తీవ్రమైన వేదన కలిగించిందని వెల్లడించారు. నడుస్తున్న ఓ రైలు ఆగివున్న మరో రైలును ఢీకొట్టిందని, ఆ రెండు రైళ్లూ ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ భయానక రైలు ప్రమాద ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.
1. ఆ సమయంలో బ్రేకింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు?
2. సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?
3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా పనిచేయకుండా పోయింది?... అంటూ సీఎం జగన్ ప్రశ్నలు సంధించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తారని కోరుతున్నాను. లేవనెత్తిన అంశాలపై లోతైన పరిశీలన చేపడతారని ఆశిస్తున్నాను. ఈ లైన్లోనే కాదు, దేశంలోని అన్ని లైన్లలో భవిష్యత్తులో ఇటువంటి ఘోర ప్రమాదాలు జరగకుండా నివారిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అని సీఎం జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. రైలు ప్రమాద ఘటనలో అయిన వారిని పోగొట్టుకున్న వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగివున్న రైలును మరో రైలు ఢీకొట్టింది. ఘటనలో అక్కడికక్కడే దాదాపు 13 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయింది..వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లను నడిపిస్తున్నాము. అయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలాగే అనిపిస్తోంది. మరి ఆ ప్రమాదం నుంచి రైల్వే అధికారులు పాఠాలు నేర్చుకోలేదా? అయినా కూడా మళ్ళీ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.