గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష..
చేయూత పథకం కింద స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలన్నారు. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలోప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఆగస్టు 10న సున్నా వడ్డీ కార్యక్రమం..
స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడమనేది చాలా కీలకమన్నారు. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలని ఆదేశించారు. గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విశాఖ పర్యటనలో బిజీ బిజీ..
కాగా మంగళవారం(ఆగస్టు 1) సీఎం జగన్ విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా విశాఖ చేరుకుంటారు. ముందుగా కైలాసపురం పోర్టు ఆస్పత్రి సమీపంలో ఇనార్భిట్ మాల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం హై టీ ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి ఏయూ క్యాంపస్ చేరుకుని ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్ , బయో మానిటరింగ్ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.