ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం పలు విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలోని అవుకు మండలం పిక్కలపల్లి తండా సమీపంలో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతి పెద్ద మూడు సోలార్ ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీలోని యువతకు ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు. సుమారు 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్‌ప్లాంట్ ప్రాజెక్టుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని ఆయన అన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కూడా ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు. సోలార్ ఎనర్జీ కోసం రూ.2.49 పైసలతో ఎన్‌హెచ్‌పీసీ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు అందజేసే ఉచిత విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఆయన వివరించారు.
వీటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల వల్ల రానున్న తరాల వారికి గ్రీన్ ఎనర్జీ అనేది పుష్కలంగా అందుతుందని ఆయన అన్నారు.
భవిష్యతులో ముఖ్య పాత్ర పోషించేంది పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులే అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకూ సోలార్ వస్తుందన్నారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు విండ్ ఎనర్జీని వాడుకోవచ్చన్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే పంప్డ్ స్టోరేజీ ని వినియోగించుకునేందుకు అవకాశాలుంటాయని ఆయన వివరించారు.
కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 7200 మెగావాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రూ.2.49లకే ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.రైతులకు ఉచితంగా పగటిపూటే విద్యుత్తు అందుబాటులోకి రావాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇప్పటికే ఏపీలో 8999 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ఉన్నాయన్నారు. తక్కువ ధరకే కరెంటు వస్తున్నందువల్ల ప్రభుత్వానికి, జెన్‌కోకు వెసులుబాటు కలుగుతుందన్నారు. 29ప్రాజెక్టులకు సంబంధించి 33వేల మెగావాట్లకు పైగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేశామన్నారు. యాగంటిలో, కమలపాడులో దాదాపుగా 2వేల మెగావాట్లకు సంబంధించి రూ.10వేల కోట్లతో చెరిసగం వాటాతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు.