JAGAN: తిరుమల పర్యటనలో ఉన్న సీఎం జగన్‌కు రాష్ట్ర గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందించింది. దీంతో ఆయన పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెనుదిరిగారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్.. పెద్దశేష వాహనం సేవలో పాల్గొనాల్సి ఉంది. అయితే గవర్నర్ అనారోగ్యం కారణంగా ఆయన గెస్ట్ హౌస్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుం గెస్ట్‌హౌస్‌లోనే ఉన్న జగన్.. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ పరిస్థితి నిలకడగా ఉంది అని సమాచారం రావడంతో రేపు ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుని తాడేపల్లికి తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
మరోవైపు ఇవాళ మధ్యాహ్నం అనారోగ్యం కారణంగా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో గవర్నర్ చేరిన సంగతి తెలిసిందే. మణిపాల్ హాస్పిటల్ వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్యపరీక్షల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్ తో బాధ పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆయనకు రోబో సాయంతో ‘అపెండెక్టమీ’ అనే సర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. సర్జరీ విజయవంతం అయిందని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
తిరుమల తిరుపతి పర్యటను వెళ్లిన జగన్ ముందుగా శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్(Srinivasa setu flyover)ని ప్రారంభించారు. మొత్తం 684 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా 67:33 సహకారంతో నిధులు సమకూర్చాయి. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే తిరుమలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేని కదలికను అందించడం ద్వారా ఆలయ నగరంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ రూపొందించారు. అనంతరం టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.