దేశవ్యాప్తంగా మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి.... ఈ సందర్భంగా పలు చోట్ల కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మొహర్రం ఊరేగింపుల్లో ప్రమాదాల కారణంగా 8మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో, ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో కరెంట్ షాక్ తగిలి ఆరుగురు మరణించారు. ఢిల్లీని నాగ్లోయ్ లో ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. పోలీసులకు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఊరేగింపు సందర్భంగా పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. అంతేకాకుండా ఈ ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చిందని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ వద్ద షెడ్యూల్ రూట్‌ను మార్చకుండా నిలిపివేశారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్) హరేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... కొంతమంది తాజియా ఊరేగింపు నిర్వాహకులు తమ ఊరేగింపును ముందుగా నిర్ణయించిన మార్గం నుండి మళ్లించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ జరిగినట్లు తెలిపారు. మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేయడంలో పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు, గుంపును చెదరగొట్టేందుకు, పోలీసులు స్వల్ప లాఠీచార్జిని ఆశ్రయించాల్సి వచ్చిందని డీసీపీ సింగ్ తెలిపారు.
అటు యూపీలో ముహర్రం ఊరేగింపు సందర్భంగా 'షియా', 'సున్నీ' ముస్లిం సంఘాల సభ్యుల రాళ్ల దాడి జరిగింది. అమ్రోహా జిల్లాలో ముహర్రం ఊరేగింపులో ఉపయోగించిన డీజే హై-వోల్టేజీ వైర్లకు తగలడంతో ఇద్దరు మరణించారు. 52 మంది గాయపడ్డారు. అమోరోహా ఎస్పీ ఆదిత్య లాంగెహ్ తెలిపిన వివరాల ప్రకారం, మృతులను షాను (35), ఒవైస్ (13)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించినట్లు లాంగే తెలిపారు. లక్నోలో హైటెన్షన్ వైర్‌తో తాకిన 'తాజియా' మంటల్లో చిక్కుకోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
జార్ఖండ్‌లోని బొకారోలో ముహర్రం ఊరేగింపును నిర్వహిస్తుండగా.. 'తాజియా' 11,000 హై-వోల్టేజీ టెన్షన్ వైర్లతో తాకడంతో నలుగురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. మృతులను సాజిద్ అన్సారీ ఆషిఫ్ రజా, గులాం హుస్సేన్ , ఇనాముల్ రబ్ గా గుర్తించారు. నలుగురి మృతి పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ముహర్రం ఊరేగింపును చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 22 మంది గాయపడ్డారు. నగరంలోని రసూల్ పారా ప్రాంతంలో ఒక తజియా 22 కెవి ఓవర్ హెడ్ విద్యుత్ వైరుతో తాకడంతో ఈ సంఘటన జరిగింది. మృతులను జునైద్ మజోతి, సాజిద్ సామాగా గుర్తించారు.