Organ Donation: ముద్దొచ్చే మాటలొలికించే ముద్దమందారం లాంటి మోము ఉన్నట్టుండి వాలిపోతే.. తడబడి వేసే బుడిబుడి అడుగులు ఒక్కసారిగా ఆగిపోతే.. అల్లరి చేష్టలతో ఆటపట్టించే బిడ్డ తమ కళ్లముందే అచేతనుడవుతుంటే.. ఆ తల్లిదండ్రుల గుండెకోతను ఏమని చెప్పగలం? గుండెలాగిపోయి కాలం స్తంభించినట్లున్న ఆ క్షణం వారి మానసిక స్థితిని ఏమని రాయగలం? అంతటి వేధననూ పంటి బిగువున భరించిన ఈ తల్లిదండ్రులు ఆ సమయంలో ప్రదర్శించిన పరిణతి ‘అద్వితీయం’.
అద్వైత్ మాతంశెట్టి.. ఆటలాడుకునే ఐదేళ్ల పసివాడు. అమ్మానాన్నలతో బైక్ మీద వెళ్తుండగా కాలం వెక్కిరించింది. హైదరాబాద్ నగరంలోని ఆల్వాల్ లోతుకుంట వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని వికలం చేసింది. చిన్నారి అద్వైత్ బ్రెయిన్ డెడ్ తో అచేతనుడయ్యాడు. ఆస్పత్రిలో పది రోజుల నిరీక్షణ ఫలించలేదు. అంతటి బాధలోనూ ఆ తల్లిదండ్రులు ఆదర్శవంతమైన ఆలోచన చేశారు. వారి జీవితంలో ఆవరించిన చీకటి తమ బిడ్డ లాంటి మరో చిన్నారికి వెలుగివ్వాలనుకున్నారు. జీవనదాన్ అనే సంస్థ ఆ తల్లిదండ్రులతో మాట్లాడగా, బరువెక్కిన గుండెతో అవయవ దానానికి అంగీకరించారు. చిన్నారి రెండు కిడ్నీలనూ దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
ఇదికూడా చదవండి: శంకర్ నేత్రాలయ అధిపతి బద్రీనాథ్ కన్నుమూత!
చిన్నారుల్లో అవయవ దానాలు అత్యంత అరుదు!
2023లో రాష్ట్రంలో మొత్తం 176 మంది దాతల నుంచి 625 అవయవాలను స్వీకరించారు. అందులో ఎక్కువ సంఖ్యలో కిడ్నీలు (251) ఉండగా, తర్వాతి స్థానంలో కాలేయాలు (151) ఉన్నాయి. చిన్నారులకు సంబంధించి అవయవదానాలు ఎంత అరుదో గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2013 నుంచి పదేళ్ల లోపు చిన్నారుల అవయవ దానం సంఖ్య ఏడు మాత్రమే. అతిచిన్న వయస్సులో అవయవదాతగా మారిన వారిలో ఒకరిగా అద్వైత్ ఆదర్శప్రాయుడయ్యాడు. ఈ ఏడాది జూన్ లో 14 నెలల దేవకీ శ్రీసాయి అనే చిన్నారి తల్లిదండ్రులు కూడా ఇదే రీతిలో అవయవదానానికి ముందుకొచ్చి మార్గదర్శకంగా నిలిచారు.