ENE Repeat: సుశాంత్ అవుట్ అయినా సినిమా ఆగదు.. ENE 2పై క్లారిటీ ఇచ్చిన తరుణ్ భాస్కర్

‘ఈ నగరానికి ఏమైంది 2’ నుంచి సాయి సుశాంత్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం బాధ కలిగించినా సినిమా ఆగదని, కార్తీక్ పాత్ర కొనసాగుతుందని తెలిపారు.

New Update
ENE Repeat

ENE Repeat

ENE Repeat: టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాకు సీక్వెల్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇటీవల ఈ సినిమా గురించి వచ్చిన కొన్ని వార్తలు ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించాయి. ENE రెండో భాగం నుంచి సాయి సుశాంత్ రెడ్డి తప్పుకున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన లేకపోవడంతో గందరగోళం పెరిగింది. తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు. సాయి సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని ఆయన వెల్లడించారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఈ విషయం తెలిసినప్పుడు తాను చాలా బాధపడ్డానని చెప్పారు. ఒక దశలో అసలు ఈ సినిమానే చేయాలా వద్దా అని కూడా ఆలోచించానని నిజాయితీగా చెప్పారు. ఎందుకంటే ENE కథ తన నిజ జీవిత స్నేహాల నుంచి వచ్చినదని, ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు.

Tarun Bhaskar
Tarun Bhaskar

అయితే కథను మళ్లీ పరిశీలించిన తర్వాత, ఈ ప్రపంచాన్ని వదిలేయలేక ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సినిమా కేవలం డబ్బు కోసం చేస్తున్న ప్రాజెక్ట్ కాదని, సరైన సమయం వచ్చినప్పుడు కథ సహజంగా ముందుకు వచ్చిందని తెలిపారు.

సాయి సుశాంత్ ఈ ప్రయాణంలో లేకపోయినా, కార్తీక్ పాత్ర మాత్రం సినిమాలో ఉంటుందని తరుణ్ స్పష్టం చేశారు. ఆ పాత్రను మరో నటుడు పోషిస్తాడని సమాచారం. అదే ప్రపంచం, అదే స్నేహితుల కథను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు. ENE 2 ఒక స్నేహితుడు ఇచ్చే కౌగిలింతలా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

తన నటీనటులు, టెక్నికల్ టీమ్‌పై పూర్తి నమ్మకం ఉందని, “ద బాయ్స్ మళ్లీ వస్తున్నారు” అంటూ అభిమానులకు హైప్ ఇచ్చారు. ఈ పోస్ట్‌తో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

అయితే తరుణ్ పోస్ట్ కు స్పందిస్తూ సాయి సుశాంత్ కూడా ఒక పోస్ట్ పెట్టారు అందులో.. " ఈ నగరానికి ఏమైంది ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. అది నాకు స్నేహాలను, జ్ఞాపకాలను, అపారమైన ప్రేమను ఇచ్చింది. నేను ఈ సినిమాలో నటించాలని కోరుకున్నాను ఎందుకంటే నేను దానిని ఇష్టపడ్డాను. ఈ సినిమా నన్ను ఆడుకునే పిల్లవాడిలా అనిపించేలా చేసింది. ఆ మార్గాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు - నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను అలా చేయవద్దని కోరారు. కానీ నా హృదయం చెప్పింది సరైనదని అనుసరించాను.
మేము మొదటి సినిమా తీసి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది, అప్పటి నుండి చాలా మారిపోయింది. జీవితం ముందుకు సాగింది, ప్రాధాన్యతలు తెలిశాయి. నా ప్రస్తుత పనితో సినిమాను బ్యాలన్స్ చేసుకోవడం అంటే కఠినమైన నిర్ణయం తీసుకోవడం. కష్టం అనిపించినా, నేను ENE 2 నుండి వెనక్కి తగ్గాలని ఎంచుకున్నాను. నేను ఎంతో ప్రేమించే టీమ్ ను, సెట్‌లోని పిచ్చిని, అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆప్యాయతను నేను కోల్పోతాను. అయితే, ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. తరుణ్ కథ చెప్పే విధానం, బాయ్స్ పెర్ఫార్మన్స్ మీరు సినిమాలోకి లీనమయ్యేలా చేస్తాయి. మీరు కొత్త కార్తీక్‌తో ప్రేమలో పడతారు. నేను ఎల్లప్పుడూ నా హృదయం చెప్పినట్లు చేశాను, ఇకపై నేను అలాగే చేస్తూనే ఉంటాను. టీమ్‌కి శుభాకాంక్షలు తప్ప మరేమీ చెప్పలేను. మీ అందరితో కలిసి పెద్ద స్క్రీన్‌పై చూడటానికి నేను వేచి ఉంటాను." అని చెప్పుకొచ్చారు.

Sushanth Reddy
Sushanth Reddy

ఈ సీక్వెల్ ‘ENE Repeat’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. “ఏలినాటి శని అయిపోయింది.. కన్యారాశి టైమ్ వచ్చింది” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో సినిమా రానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కకుమను మళ్లీ కనిపించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై సినిమా రూపొందుతోంది. సంగీతాన్ని వివేక్ సాగర్ అందిస్తున్నారు.

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా మొదటి విడుదల కంటే రీ రిలీజ్‌లోనే ఎక్కువ ఓపెనింగ్స్ అందుకోవడం చూస్తే, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎంత ఎక్కువో అర్థమవుతుంది. అందుకే ENE 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పుడు అభిమానుల్లో ఉన్న ప్రశ్న ఒక్కటే కార్తీక్ పాత్రలో ఎవరు నటిస్తారు? ఆ క్యారెక్టర్‌కు వచ్చిన క్రేజ్, మీమ్స్, డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. అలాంటి పాత్రకు కొత్త నటుడిని ఫిక్స్ చేయడం మేకర్స్‌కు పెద్ద సవాలే.

అయితే నటుల నుంచి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టడంలో తరుణ్ భాస్కర్‌కు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. కొత్త కార్తీక్‌తో ఆయన ఏ మ్యాజిక్ చేస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు