/rtv/media/media_files/2025/12/17/sree-leela-2025-12-17-16-33-36.jpg)
Sree Leela
Sree Leela: నటి శ్రీలీల సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న తన ఫేక్ ఏఐ ఫోటోలపై గట్టిగా స్పందించారు. ఇటీవల కొందరు నటీనటుల పేర్లతో నకిలీ ఖాతాలు తెరవడం, ఏఐతో తయారు చేసిన తప్పుడు చిత్రాలు, వీడియోలు ప్రచారం చేయడం పెరిగిపోవడంతో ఆమె తన ఆందోళనను బహిరంగంగా వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, శ్రియా సరన్, ప్రియాంక మోహన్ వంటి నటులు మాట్లాడగా, ఇప్పుడు శ్రీలీల కూడా దీనిపై నోరు విప్పారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/17/sree-leela-emotional-post-2025-12-17-16-37-44.jpeg)
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అందులో ఏఐతో తయారు చేసే అర్థంలేని, తప్పుదారి పట్టించే కంటెంట్‌కు మద్దతు ఇవ్వవద్దని సోషల్ మీడియా వినియోగదారులను కోరారు. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేయడానికి వచ్చిందని, కానీ దానిని తప్పుగా వాడితే సమస్యలే పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించడం ఒకటి, దుర్వినియోగం చేయడం మరోటి అని ఆమె స్పష్టం చేశారు.
శ్రీలీల మాట్లాడుతూ, ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి కూతురు, మనవరాలు, అక్క, చెల్లి, స్నేహితురాలు లేదా సహోద్యోగి అని గుర్తు చేశారు. వృత్తి ఏదైనా సరే, మహిళలందరికీ గౌరవం, భద్రత అవసరమని ఆమె అన్నారు. వినోద రంగం ఆనందాన్ని పంచే వేదికగా ఉండాలని, అక్కడ పనిచేసేవారు భయంలేకుండా ఉండగలమనే నమ్మకం ఉండాలని చెప్పారు.
తన పనుల వల్ల సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని విషయాలు తనకు ఆలస్యంగా తెలిసాయని, అవి తన దృష్టికి తీసుకొచ్చిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకుండా తన ప్రపంచంలో తాను ఉండేదాన్నని, కానీ ఇప్పుడు జరుగుతున్నవి మాత్రం చాలా బాధపెడుతున్నాయని ఆమె చెప్పారు. ఇది తనకు మాత్రమే కాదు, తనతో పాటు ఉన్న చాలామంది సహనటులకు కూడా జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
అందుకే ఈ విషయంపై మౌనం వీడాల్సి వచ్చిందని, అందరి తరఫున మాట్లాడుతున్నానని శ్రీలీల తెలిపారు. ప్రేక్షకులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, బాధితుల పక్షాన నిలవాలని ఆమె కోరారు. గౌరవంతో, బాధ్యతతో సోషల్ మీడియాను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
చివరిగా, ఈ అంశాన్ని ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని, సరైన చర్యలు తీసుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను మంచి పనులకు ఉపయోగించాలని, ఎవరినీ బాధించేలా వాడకూడదని శ్రీలీల స్పష్టంగా తెలిపారు.
Follow Us