Rajamouli - RGV: "నాస్తికత్వం నేరం కాదు" నా సపోర్ట్ రాజమౌళికే : ఆర్జీవీ

‘వారణాసి’ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. హిందూ సంస్థలు విమర్శిస్తుండగా, ఆర్జీవీ ఆయనకు మద్దతుగా నిలిచి “నాస్తికత్వం నేరం కాదు” అని చెప్పారు. ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Rajamouli - RGV

Rajamouli - RGV

Rajamouli - RGV: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘వారణాసి’(Varanasi Movie) ప్రారంభోత్సవం ప్రస్తుతం పెద్ద వివాదానికి కారణమైంది. ఈ ఈవెంట్ సమయంలో సాంకేతిక సమస్య రావడంతో రాజమౌళి కొంత అసహనం వ్యక్తం చేస్తూ, “నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు… మా నాన్న చెబుతున్నట్టు హనుమంతుడు నడిపిస్తే ఇలా జరుగుతుందా?” అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

Rajamouli Controversial Comments 

ఈ వ్యాఖ్యలపై  పలు హిందూ సంస్థలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ సహా కొన్ని సంఘాలు రాజమౌళి క్షమాపణ కోరడం, లేకపోతే ఆయన సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించడం మరింత వివాదం రేపింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) రాజమౌళిని బలంగా సమర్థిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. “భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఇస్తుంది. నమ్మే హక్కు ఎంత ఉంటే, నమ్మకపోవడానికి కూడా అంతే హక్కు ఉంటుంది” అని ఆర్జీవీ తెలిపారు.

రాజమౌళి దేవుణ్ని నమ్మకపోతే ఆయన సినిమాల్లో దేవుడి కథలు ఎందుకు ఉంటాయి అని కొందరు అడుగుతున్నారని, అది పూర్తిగా అర్థంలేని ప్రశ్న అని ఆర్జీవీ అన్నారు. “గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? హారర్ సినిమా తీయాలంటే దెయ్యం అవ్వాలా?” అంటూ ఆయన వ్యంగ్యంగా స్పందించారు.

రాజమౌళిని విమర్శించే భక్తులపై ఆర్జీవీ మరింత కఠిన వ్యాఖ్యలు చేశారు. “రాజమౌళి దేవుణ్ని నమ్మకపోయినా, ఆయన సాధించిన విజయం, సంపద, గుర్తింపు - చాలా మంది భక్తులు ఎన్నో జన్మల్లో కూడా పొందలేనివి. దీన్ని జీర్ణించుకోలేక వాళ్లలో అసూయ పెరుగుతోంది” అని స్పష్టం చేశారు.

“దేవుడు ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు అన్నది గమనిస్తూ నోట్‌బుక్ పట్టుకుని కూర్చోరు. రాజమౌళి నాస్తికుడైనంత మాత్రాన దేవుడి శక్తి తగ్గదు. తగ్గేది కొంతమంది మనుషుల నమ్మకం మాత్రమే” అని వర్మ వ్యాఖ్యానించారు.

చివరిగా ఆర్జీవీ, “దేవుడు బాగానే ఉన్నాడు… రాజమౌళి కూడా బాగానే ఉన్నాడు… అర్థం చేసుకోలేని వారే ఇబ్బంది పడుతున్నారు. ‘వారణాసి’ సినిమా ఆయన కెరీర్‌ను ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. అసలు సమస్య నాస్తికత్వం కాదు… భక్తుల అసూయే నిజమైన సమస్య” అని ట్వీట్ చేశారు. రాజమౌళి వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్ కామెంట్లు ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisment
తాజా కథనాలు