Rajasaab: 'రాజాసాబ్'ను వెంటాడుతున్న కష్టాలు.. పండక్కి థియేటర్లు దక్కేనా..?

సంక్రాంతికి నైజాంలో థియేటర్ల కోసం పోటీ తీవ్రమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న ‘ది రాజా సాబ్’కు దిల్ రాజు తీసుకొస్తున్న పలు సినిమాలు పెద్ద సవాల్‌గా మారాయి. ఎక్కువ రిలీజ్‌లతో దిల్ రాజుకు ఆధిక్యం ఉండగా, రాజా సాబ్‌కు స్క్రీన్లు కాష్టంలా కనిపిస్తోంది.

New Update
Rajasaab

Rajasaab

Rajasaab: ప్రభాస్(Prabhas) నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాకు నైజాం ప్రాంతంలో పెద్ద సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌,  నిర్మాత దిల్ రాజు మధ్య గత కొంతకాలంగా థియేటర్ల విషయంలో పోటీ వాతావరణం కొనసాగుతోంది. గతంలో కూడా థియేటర్ల కేటాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇదే పరిస్థితి ఇప్పుడు రాజా సాబ్ రిలీజ్‌కు అడ్డంకిగా మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతి 2026కి ఈ పోటీ మళ్లీ మొదలవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై 'ది రాజా సాబ్' విడుదల కానుండగా, దిల్ రాజు కూడా అదే పండుగకు ఒకటి కాదు, రెండు కాదు… పలు సినిమాలను తీసుకొస్తున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి వంటి సినిమాలు దిల్ రాజు నుంచి రానున్నాయి.

అదే సమయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా విడుదల అవుతోంది. ఏషియన్ సినిమాస్‌కు దిల్ రాజుతో మంచి అనుబంధం ఉండటంతో, ఈసారి కూడా ఇద్దరూ కలిసి ప్లాన్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. గతంలో వీరు కలిసి పలు సినిమాలను పంపిణీ చేశారు.

ఇదే కాకుండా జన నాయకన్, పరాశక్తి వంటి డబ్బింగ్ సినిమాలు కూడా దిల్ రాజు, ఏషియన్ ద్వారా విడుదల కానున్నాయి. అంటే సంక్రాంతి సీజన్‌లో దిల్ రాజుకు చెందిన సినిమాలు థియేటర్లలో ఎక్కువగా ఉండబోతున్నాయి.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలున్న ది రాజా సాబ్ మీదే పూర్తిగా ఆశలు పెట్టుకుంది. ప్రభాస్ సినిమా కావడంతో క్రేజ్ ఎక్కువగా ఉన్నా, థియేటర్ల పోటీ మాత్రం తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో నైజాం ప్రాంతంలో సరిపడా స్క్రీన్లు దక్కించుకోవడం, పండుగ రోజుల్లో వాటిని నిలబెట్టుకోవడం మైత్రీ మూవీ మేకర్స్‌కు పెద్ద పరీక్షగా మారనుంది. సంక్రాంతి బరిలో థియేటర్ల కోసం జరగబోయే పోరు రాజా సాబ్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతుందన్నది చూడాలి.

Advertisment
తాజా కథనాలు