Shilpa Shetty: చిక్కుల్లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.. వరుస కేసులతో హాట్ టాపిక్..!

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై రూ.60 కోట్ల మోసం కేసులో EOW చీటింగ్ కేసు సెక్షన్ 420ను చేర్చింది. బెస్ట్ డీల్ టీవీ పెట్టుబడులపై విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో బెంగళూరులోని శిల్పా శెట్టి రెస్టారెంట్ ‘బాస్టియన్’పై కూడా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైంది.

New Update
Shilpa Shetty

Shilpa Shetty

Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై న్యాయ సమస్యలు మరింత పెరిగాయి. సుమారు రూ.60 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) తాజాగా చీటింగ్ కేసు (IPC సెక్షన్ 420)ను చేర్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది.

ఈ కేసు ఇప్పుడు మూసివేసిన ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి సంబంధించినది. వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు మేరకు ఈ విచారణ మొదలైంది. 2015 నుంచి 2023 మధ్య కాలంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తనను పెట్టుబడులు పెట్టేలా ఒప్పించి, మంచి లాభాలు ఇస్తామని చెప్పారని కొఠారి ఆరోపిస్తున్నారు. మొత్తం రూ.60 కోట్లు పెట్టుబడి పెట్టినప్పటికీ, ఆ డబ్బు వ్యాపారానికి కాకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణ సమయంలో రాజ్ కుంద్రా, ఆ డబ్బులో కొంత భాగం నటీమణులు బిపాసా బసు, నేహా ధూపియాలకు ప్రొఫెషనల్ ఫీజులుగా చెల్లించామని అధికారులకు తెలిపారు. అంతకుముందు, 2016 నోట్ల రద్దు తర్వాత కంపెనీకి భారీ నష్టాలు వచ్చాయని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పెట్టుబడులను తిరిగి చెల్లించలేకపోయామని కుంద్రా వివరణ ఇచ్చారు.

Case Filed on Shilpa Shetty

అయితే, కొత్త ఆధారాలు లభించడంతో చీటింగ్ కేసును చేర్చినట్లు కొఠారి న్యాయవాదులు తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు పరిశీలించిన తర్వాత రూ.60 కోట్లకు పైగా మోసం జరిగినట్టు స్పష్టమైందని EOW కోర్టుకు తెలిపింది. ఈ కేసులో పెద్ద మొత్తం ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ను కూడా ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇటీవల రాజ్ కుంద్రా తండ్రి అనారోగ్యం కారణంగా లండన్ వెళ్లేందుకు ఈ దంపతులు బాంబే హైకోర్టును అనుమతి కోరారు. అయితే, మొత్తం రూ.60 కోట్లను డిపాజిట్ చేయాలనే షరతుతోనే కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, బెంగళూరులోని శిల్పా శెట్టి రెస్టారెంట్ ‘బాస్టియన్’ కూడా వివాదాల్లో చిక్కుకుంది. అనుమతించిన సమయాన్ని మించి కార్యకలాపాలు నిర్వహించడం, అర్ధరాత్రి పార్టీలకు అనుమతి ఇవ్వడం వంటి కారణాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై శిల్పా శెట్టి స్పందిస్తూ, తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పని, కావాలనే తమ పేరును చెడగొడుతున్నారని సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశామని, కోర్టు నిర్ణయంపై తమకు నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వరుస కేసులతో వార్తల్లో నిలుస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు