/rtv/media/media_files/2025/07/13/kota-srinivasa-rao-died-2025-07-13-06-41-12.jpg)
Kota Srinivasa Rao Died
తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన ప్రస్థానం అద్భుతం. కోట శ్రీనివాసరావు అభినయానికి పెట్టని కోట.. నవరస నటనా సార్వభౌముడు.
జననం
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు 1942 జులై 10న జన్మించారు. నాటక రంగం పట్ల అపారమైన ఆసక్తితో, బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి పూర్తిస్థాయి నటనకు అంకితమయ్యారు. ఆయన నాటక అనుభవం ఆయన సంభాషణ పంపిణీలో ఒక ప్రత్యేకతను తెచ్చింది.
సినీ ప్రవేశం, ప్రస్థానం:
1978లో చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తో కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట్లో సినిమాలను సీరియస్‌గా తీసుకోకపోయినా, 1985లో వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంలోని 'గుడిశెల కాశయ్య' పాత్రతో తెలంగాణ యాసను పలికిస్తూ అద్భుతమైన గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు. విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు ఇలా ఏ పాత్ర అయినా అవలీలగా పోషించి, నవరసాలు పండించగల బహుముఖ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి మొత్తం 750కి పైగా సినిమాల్లో తన నటనా ప్రతిభను చాటారు.
ఆయన నటించిన ముఖ్యమైన చిత్రాలు
అహ నా పెళ్ళంట (1987): ఇందులో పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్రతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
గాయం (1993): పొలిటికల్ గూండాగా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది.
యమలీల (1994): మాంత్రికుడిగా ఆయన పాత్ర ఎంతో పేరు తెచ్చుకుంది.
మనీ (1993): ఇందులో ఆయన ఇంగ్లీష్ సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996): వెంకటేష్ తండ్రిగా నటించి మెప్పించారు.
గణేష్ (1998): కామెడీ విలన్‌గా సాంబశివుడు పాత్రలో ఆకట్టుకున్నారు.
ఆ నలుగురు (2004): ఈ చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ, బృందావనం వంటి చిత్రాలలో తాత పాత్రలు, అత్తారింటికి దారేది (2013) లోని కీలక పాత్రలు కూడా ఆయన కెరీర్‌లో మైలురాళ్ళు.
తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ 750కి పైగా చిత్రాలలో నటించారు. అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప నటులతో కలిసి ‘సర్కార్’ వంటి హిందీ చిత్రాలలో నటించారు. కేవలం విలన్‌గా, హాస్యనటుడిగానే కాకుండా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు. తండ్రి, బాబాయ్, పెద్దమనిషి, రాజకీయ నాయకుడు, పిసినిగొట్టు, ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయారు.
'అత్తారింటికి దారేది', 'దూకుడు', 'సర్కార్', 'బొమ్మరిల్లు', 'అతడు', 'ఠాగూర్', 'ఇడియట్', 'స్టూడెంట్ నంబర్ 1' వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోయాయి. తెలుగులోని వివిధ మాండలికాలను (రాయలసీమ, తెలంగాణ, శ్రీకాకుళం, గోదావరి) అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత. పాత్రకు తగ్గట్టు యాసను పలికించి సహజత్వాన్ని తీసుకొచ్చేవారు.
తొమ్మిది నంది అవార్డులు:
తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కోట శ్రీనివాసరావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన నటనలోని వైవిధ్యానికి గుర్తింపుగా తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు (ఉత్తమ ప్రతినాయకుడు, సహాయ నటుడు, ఉత్తమ నటుడు వంటి వివిధ విభాగాల్లో) అందుకున్నారు. 1985లో "ప్రతిఘటన" చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు, 1993లో "గాయం"కు ఉత్తమ విలన్, 2004లో "ఆ నలుగురు"కు ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఇలా చాలా సినిమాలకు అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గానూ SIIMA అవార్డు దక్కింది.
భారతీయ సినిమాకు చేసిన సేవలకు గానూ 2015లో భారత ప్రభుత్వం నుండి దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం "పద్మశ్రీ" అందుకున్నారు. "పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం" (2013) వంటి అనేక పురస్కారాలు కూడా ఆయనను వరించాయి.
రాజకీయ ప్రస్థానం:
కోట శ్రీనివాసరావు నటుడిగానే కాకుండా రాజకీయవేత్తగా కూడా పనిచేశారు. 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి MLAగా సేవలందించారు.
#Actor Kota Srinivasa Rao