Ticket Prices: ఐబొమ్మ దెబ్బ.. సినిమా టికెట్ కేవలం రూ.99కే..!

'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా టికెట్ ధరలను పైరసీని తగ్గించేందుకు ఈటీవీ విన్ రూ.99 (సింగిల్ స్క్రీన్), రూ.105 (మల్టీప్లెక్స్) గా నిర్ణయించింది. నవంబర్ 21న చిత్రం విడుదల కానుంది. టికెట్ ధరలు తగ్గితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు పెరుగుతారని టీమ్ పేర్కొంది.

New Update
Ticket Prices

Ticket Prices

Ticket Prices: పైరసీ కారణంగా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఈటీవీ విన్(ETV Win) ప్రత్యేక చర్య తీసుకుంది. వారి బ్యానర్‌లో రూపొందిన కొత్త సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) టికెట్ ధరను ప్రేక్షకుల కోసం చాలా తగ్గించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను రూ.99, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.105 గా నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

సినిమా వివరాలు

అఖిల్, తేజస్విని జంటగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వేణు ఊడుగుల ఈ సినిమాను నిర్మించారు. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రేమ, కామెడీతో నిండిన ఈ కథను కుటుంబ ప్రేక్షకులు కూడా ఇష్టపడతారని టీమ్ నమ్ముతోంది.

పైరసీపై ఈటీవీ విన్ పోరాటం

ఈటీవీ విన్ పైరసీని అరికట్టడం కోసం ముందు నుండి కృషి చేస్తూ వస్తోందని సాయికృష్ణ తెలిపారు. గతంలో వారి ప్లాట్‌ఫార్మ్ నుంచి విడుదలైన ‘క’ చిత్రం పైరసీకి గురి కాకుండా విజయవంతంగా కాపాడిన విషయం ఆయన గుర్తు చేశారు. ఇటీవల ఐ బొమ్మ రవి అరెస్టు తర్వాత పైరసీపై(iBomma Piracy) చర్చ మరింత పెరిగిందని తెలిపారు. తెలంగాణ పోలీసులకు దీనిపై ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాడు.

అయితే రవి అరెస్ట్ తర్వాత చాలా మంది ప్రేక్షకులు “సినిమా టికెట్ ధరలు, పాప్‌కార్న్ ధరలు తగ్గితే థియేటర్లకు వస్తాం” అని చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అందుకే టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించాలని నిర్ణయించామని చెప్పారు.

పైరసీని ఆపేది మనమే - సాయికృష్ణ

“ఒక్క సినిమా థియేటర్‌లో చూస్తే పైరసీ ఆగిపోదు. కానీ మన నుంచే మొదలైన మద్దతు పెరిగితే, పైరసీ తగ్గుతుంది. సినిమా ఇండస్ట్రీని కాపాడాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది” అని సాయికృష్ణ తెలిపారు. రాజు వెడ్స్ రాంబాయి ఒక అందమైన ప్రేమకథ అని, ఈ ప్రేమకథ ప్రతి పట్టణం, ప్రతి ఊరిలోని ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం అంతా పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తక్కువ ధరలో థియేటర్ అనుభవం ఇచ్చే నిర్ణయం ప్రేక్షకులను ఆకర్షించబోతోందని చెప్పవచ్చు.

Advertisment
తాజా కథనాలు