Epstein files : ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. లిస్టులో బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు..నిజమెంత?

అమెరికన్ బిలియనీర్, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కు సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల బహిర్గతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేగింది.

New Update
bigb

అమెరికన్ బిలియనీర్, లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కు సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల బహిర్గతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేగింది. అయితే, ఈ పత్రాల్లో భారతీయ సినీ దిగ్గజాలైన అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తో పాటు అనురాగ్ కశ్యప్, నందితా దాస్ పేర్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతోంది.

జెఫ్రీ ఎప్‌స్టీన్  పత్రాల్లో దర్శకుడు అనురాగ్ కశ్యప్, నందితా దాస్ పేర్లు కేవలం కొన్ని ఈమెయిల్ సంభాషణల్లో మాత్రమే కనిపించాయి. ఇవి అంతర్జాతీయ సాంస్కృతిక, విద్యాసంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు మాత్రమే. వీరికి ఎప్‌స్టీన్  కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం వృత్తిపరమైన వేదికలపై ప్రస్తావన వచ్చినట్లు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ పేర్లు కనిపించడానికి అసలు కారణం వైరల్ అవుతున్న తప్పుడు స్క్రీన్ షాట్లు మాత్రమే.  షారుఖ్ ఖాన్ పేరు 2016 నాటి ఒక Quora Digest ఈమెయిల్‌లో ఉంది. అందులో షారుఖ్ ఫిట్‌నెస్, 'ఓం శాంతి ఓం' సినిమాలోని ఆయన సిక్స్ ప్యాక్ అబ్స్ గురించి జరిగిన చర్చ ఉంది తప్ప ఎప్‌స్టీన్  కేసుతో ఎటువంటి సంబంధం లేదు.

అంబాసిడర్ల జాబితాలో బిగ్ బి పేరు

2009లో పంపిన ఒక ఈమెయిల్‌లో ఐక్యరాజ్యసమితి (UN) గుడ్‌విల్ అంబాసిడర్ల జాబితాలో బిగ్ బి పేరు ఉంది. UNICEF అంబాసిడర్‌గా ఆయన చేసిన సేవలను ఉద్దేశించి ఆ సమాచార పత్రం ఉంది తప్ప, ఎప్‌స్టీన్  నేర చరిత్రతో దీనికి ఏమాత్రం పొంతన లేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు కేవలం క్రాప్ చేసిన స్క్రీన్ షాట్లు,  తప్పుగా అర్థం చేసుకున్న పత్రాల వల్లే వ్యాపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. వీరిపై ఎలాంటి ఆరోపణలు లేవని, కోర్టు పత్రాల్లో వీరి పేర్లు నేరస్థులుగా లేదా బాధితులుగా ఎక్కడా నమోదు కాలేదని స్పష్టమైంది. తప్పుడు సమాచారాన్ని నమ్మి రూమర్లు వ్యాప్తి చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు