Rajasaab: హద్దులు దాటిన అభిమానం..! ‘ది రాజాసాబ్’ థియేటర్ లో ఫ్యాన్స్ అత్యుత్సాహం..

ఓడిశాలోని రాయగడలో ‘ది రాజాసాబ్’ ప్రదర్శన సమయంలో అభిమానులు థియేటర్‌లో పటాసులు కాల్చడంతో మంటలు చెలరేగాయి. కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భద్రత కారణంగా షో తాత్కాలికంగా నిలిపివేశారు.

New Update
Rajasaab

Rajasaab

Rajasaab: ప్రభాస్(Prabhas) నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ మూవీ థియేటర్ లో అభిమానులు అతిగా చేసిన సంబరాలు ఒక ప్రమాదకర ఘటనకు దారి తీసాయి. తెలుగు సినిమా అభిమానులు తమ ఇష్టమైన హీరో సినిమా విడుదలైనప్పుడు సంబరాలు చేయడం కొత్త కాదు. కానీ కొన్నిసార్లు ఆ ఉత్సాహం హద్దులు దాటితే సమస్యలు వస్తాయన్నదానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.

ఓడిశాలోని రాయగడ జిల్లాలో ఉన్న అశోక్ టాకీస్ అనే థియేటర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రోజున ‘ది రాజాసాబ్’ సినిమా ప్రదర్శన జరుగుతుండగా, థియేటర్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్‌కు చేరుకున్నారు. సినిమా మధ్యలో ప్రభాస్ తెరపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో కొందరు అభిమానులు హద్దులు దాటి సంబరాలు చేసుకున్నారు.

సినిమా స్క్రీన్‌కు దగ్గరగా కూర్చున్న కొంతమంది అభిమానులు థియేటర్‌లోనే పటాసులు కాల్చినట్లు సమాచారం. అంతేకాకుండా, హారతి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో వెలిగించిన పటాసుల వల్ల ఒక్కసారిగా స్క్రీన్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీనితో థియేటర్ మొత్తం ఒక్కసారిగా కలకలం అయింది.

మంటలు చెలరేగగానే ప్రేక్షకులు భయంతో కేకలు వేశారు. కొద్ది సేపు థియేటర్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక చర్యలు చేపట్టి మంటలు ఎక్కువగా వ్యాపించకుండా ఆపగలిగారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

భద్రత కారణంగా కొంతసేపు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ప్రేక్షకులను శాంతింపజేసిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. థియేటర్‌లో ఇలా పటాసులు కాల్చడం ప్రమాదకరమని, ఇటువంటి చర్యల వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతోంది సంక్రాంతి సీజన్ కారణంగా ఫ్యామిలి ఆడియన్స్ ఈ సినిమాకు వెళ్తున్నారు. ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ థియేటర్లకు చేరుకుంటున్నారు. అయితే ఈ ఘటన తర్వాత థియేటర్లలో భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు