/rtv/media/media_files/2025/10/14/christopher-nolan-2025-10-14-12-54-59.jpg)
Christopher Nolan
Christopher Nolan: ప్రపంచ సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రిస్టోఫర్ నోలన్ తదుపరి చిత్రం ‘ది ఓడిస్సీ’ (The Odyssey) ఇప్పటికే విడుదలకు ముందే అద్భుతమైన హైప్ ను సొంతం చేసుకుంది. ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లర్, టెనెట్, ఓపెన్‌హైమర్ వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నోలన్, ఈసారి గ్రీకు పురాణ కథనమైన హోమర్ రాసిన ‘ఓడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో మాట్ డామన్, టామ్ హాలండ్ నటిస్తున్నారు. ఇక మరో విశేషం ఏంటంటే, నోలన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ‘ఇన్సెప్షన్’ చిత్రంలో నటించిన ఎలియట్ పేజ్(Elliot Page), ఈ చిత్రంతో మళ్లీ నోలన్‌తో కలసి పనిచేస్తున్నారు. ఈ విషయం గురించి ఎలియట్ మాట్లాడుతూ ‘‘ఇంతటి గొప్ప దర్శకుడితో మళ్లీ పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ‘ది ఓడిస్సీ’లో భాగం కావడం గర్వంగా ఉంది’’ అన్నారు.
2026 జూలై 17న The Odyssey విడుదల..
ఈ సినిమా వచ్చే 2026 జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే, అమెరికాలో 25-26 ఐమ్యాక్స్ 70mm థియేటర్లలో జూలై 16 నుంచి స్పెషల్ ప్రివ్యూలు మొదలవుతాయని ఇప్పటికే ప్రకటించారు. పైగా, 2025 జూలై 18 అర్ధరాత్రి విడుదల చేసిన టికెట్లు గంటలోపే 95% అమ్ముడుపోవడం విశేషం. టికెట్లు విడుదలైన వెంటనే వీటిని కొనుగోలు చేయడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. దీని ద్వారా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థమవుతోంది.
ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్ 70mm ఫిల్మ్ కెమెరాలతో తెరకెక్కిస్తున్నారు. ఇది నోలన్ మొదటి పూర్తి ఐమ్యాక్స్ షూటింగ్ చిత్రం కావడం మరో హైలైట్. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా పలు కొత్త ప్రయోగాలకు మార్గం వేస్తుందని అంచనాలు ఉన్నాయి.
"ది ఓడిస్సీ" టీజర్, ట్రైలర్ విడుదలైతే ఇంకెంత క్రేజ్ వస్తుందో ఊహించడమే కష్టం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నోలన్ అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది కేవలం సినిమా కాదు, ఒక విశిష్టమైన సినీ అనుభవం. ఇప్పటివరకు క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమాల కంటే మరో అడుగు ముందుకే ఈ సినిమా ఉంటుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.