Prabhas Spirit: ప్రభాస్ 'స్పిరిట్'ను టార్గెట్ చేస్తున్నారా..? ఎందుకిన్ని పుకార్లు..?

ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చిరంజీవి, గోపీచంద్ నటిస్తున్నారనే వార్తలు కేవలం పుకార్లేనని చిత్ర బృందం స్పష్టం చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 మార్చి 5న విడుదల కానుంది.

New Update
Prabhas Spirit

Prabhas Spirit

Prabhas Spirit: ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’(Raja Saab) సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా, ఆయన రాబోయే సినిమాలపై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పోలీస్ డ్రామా ‘స్పిరిట్’ సినిమాపై అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా విపరీతమైన హైప్ ఉంది.

‘స్పిరిట్’ ఇప్పటికే పాన్-ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. అయితే సినిమా హైప్‌ను తగ్గించేలా అవసరం లేని పుకార్లు తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అధికారిక ప్రకటన లేకపోయినా, కొందరు మీడియా వర్గాలు నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేస్తున్నాయి.

ముందుగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi in Spirit) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా తప్పు అని స్పష్టం చేశారు. అయినా మళ్లీ అదే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల మరోసారి గోపీచంద్(Gopichand in Spirit) ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో నటిస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్‌కు దగ్గర వర్గాలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాయి.

ఇలాంటి ఆధారంలేని వార్తలతో అభిమానులు అనవసరమైన అంచనాలు పెట్టుకోవద్దని చిత్ర బృందం భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన స్పిరిట్ సౌండ్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై భారీ చర్చ మొదలైంది. అంతేకాదు, విడుదల తేదీని ముందుగానే ప్రకటించడం ద్వారా కూడా చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది.

‘స్పిరిట్’ సినిమాను సందీప్ రెడ్డి వంగా రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా కలిసి నిర్మిస్తున్నారు. ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు