ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలీవుడ్‌ను ఏలిన దిగ్గజ నటుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నేడు. ఎన్నో సినిమాల్లో నటించి అగ్రకథానాయకుడిగా ఎదిగిన అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. 82 ఏళ్ల వయస్సులో కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటీవల కల్కీతో హిట్ అందుకున్న బిగ్‌బీ వెట్టయాన్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం బిగ్‌బీ సినిమాలు, షోలు, యాడ్స్‌తో తీరిక లేకుండా ఉంటున్నారు.
అమితాబ్ అసలు పేరు..
అమితాబ్ బచ్చన్ 1942 అక్టోబర్ 11న అలహాబాద్‌లో జన్మించారు. ప్రఖ్యాత హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ తండ్రి. అమితాబ్‌కు మొదటిగా ఇంక్విలాబ్ అని పేరు పెట్టారు. కానీ తర్వాత అమితాబ్‌గా మార్చారు. అమితాబ్ తండ్రి బచ్చన్ అనే కలం రాశారు. దీన్నే అమితాబ్ ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఢిల్లీలో బీఎస్సీ చదువుకున్న అమితాబ్‌కి నటన అంటే చాలా ఇష్టం ఉండటంతో తల్లి సపోర్ట్‌తో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో మొదటిగా 1969లో భువన్ షోమ్ అనే సినిమాకి అమితాబ్ వాయిస్ అందించారు. ఈ సినిమా డైరెక్టర్ మృణాల్ సేన్ జాతీయ అవార్డు కూడా ఈ చిత్రానికి అందుకున్నారు. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వంలో సాత్ హిందుస్తానీ సినిమాలో నటించారు. ఏడు ప్రధాన పాత్రల్లో అమితాబ్ ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో కూడా అమితాబ్ నటనకు మంచి మార్కులు పడటంతో వరుసగా పర్వానా, గుడ్డీ, బాంబే టు గోవా, జంజీర్, లావారిస్, కాలా పత్తర్, దీవార్, షోలే, హమ్ వంటి సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు.
ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా..
పుణె టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అమితాబ్ జయ బాధురిని కలిశారు. ఈ తర్వాత జంజీర్ అనే సినిమాలో ఆమెతో కలిసి నటించారు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా అదే ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె శ్వేతానంద, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరి కాంబోలో సినిమాలు విడుదలయ్యాయి. అమర్ అక్బర్ ఆంటోని, సుహాగ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచి పెద్ద హిట్‌ను అమితాబ్‌కు తెచ్చిపెట్టాయి. మిస్టర్ నట్వర్ లాల్ సినిమాలో బిగ్‌బీ మొదటిసారి పాట కూడా పాడారు. ఈ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరిల్లో ఆయనకు నామినేషన్లు కూడా లభించాయి. ఆ తర్వాత అగ్నిపథ్ సినిమాతో అతను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. కానీ ఆ తర్వాత 1992 నుంచి అమితాబ్ 5 ఏళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్నారు. సొంతంగా నిర్మాణ సంస్థ నిర్మించి నష్టపోయారు. ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతితో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. మొత్తం నాలుగు జాతీయ అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు పొందారు.
రాజకీయాల్లోకి..
అమితాబ్ బచ్చన్ 1984లో రాజీవ్ గాంధీకి మద్దతుగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇందులో గెలిచిన కూడా మూడేళ్లకే పదవికి రాజీనామా చేశారు. అమితాబ్‌కు 1984లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్, 2015లో పద్మవిభూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. అలాగే 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన లెగియన్ ఆఫ్ హానర్‌తో గౌరవించింది. 2013లో ది గ్రేట్ గాట్స్ బీ అనే సినిమాతో అమితాబ్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అమితాబ్ బచ్చన్ ఒక్కో సినిమాకి దాదాపుగా ఆరు కోట్లు తీసుకుంటారని సమాచారం. బిగ్‌బీ దగ్గర విలాసవంతమైన భవనాలు, కార్లు ఉన్నాయి. ముంబాయిలో ప్రస్తుతం అమితాబ్ నివసిస్తున్న ఇంటి ఖరీదు రూ.112 కోట్లు. ప్రత్యేకంగా కోట్లు విలువ చేసే జెట్ విమానం కూడా అమితాబ్ దగ్గర ఉంది. మొత్తం మీద అమితాబ్ ఆస్తుల విలువ రూ.3190 కోట్లు ఉన్నట్లు సమాచారం.