రొమాంటిక్ పోలీస్ ఆఫీసర్..
హైదరాబాద్‌లో రొమాంటిక్ పోలీస్ ఆఫీసర్ వ్యవహారం బయటపడింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(CID)డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ సింగ్ రాసలీలలు కలకలం రేపుతున్నాయి. సమస్య ఉందని ఆశ్రయించిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మార్గదర్శి కాలనీకి చెందిన మహిళ తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSSPDCLలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. 2020లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిపార్ట్‌మెంట్ క్రీడా పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో సీఐడీ డీఎస్పీ కిషన్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. శిక్షణ తరగతులకు హాజరుకావాలని అతను ఆమెకు సూచించాడు.
వాట్సాప్‌లో లైంగిక వేధింపులు..
సీనియర్ పోలీసు అధికారి కావడంతో అంగీకరించిన బాధితురాలు.. తన ఫోన్ నంబరును పోలీసు అధికారికి ఇచ్చింది. అప్పటి నుంచి ఆ పోలీసు ఉన్నతాధికారి ఆమె వాట్సాప్ నంబరుకు రొమాంటిక్ హిందీ పాటలు, సెన్సార్ చేయని వీడియోలను పంపించడం మొదలుపెట్టాడు. శిక్షణ తరగతులకు చీర కట్టుకోవాలని రావాలంటూ ఒత్తిడికి గురి చేసేవాడని బాధితురాలు వాపోయింది. కిషన్‌సింగ్ ప్రవర్తన బాగా లేకపోవటంతో ఫోన్ కాల్స్, వీడియోలకు ఏడాది పాటు స్పందించడం మానేసింది. కొన్ని నెలల క్రితం హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం బాధితురాలు సదరు సీఐడీ పోలీసు అధికారిని సంప్రదించింది. దీన్ని ఆసరా చేసుకున్న అతను.. తనతో చనువుగా ఉండాలని తనను కౌగిలించుకోవాలని వేధించడం మొదలుపెట్టారు.
షీ టీమ్స్‌ను ఆశ్రయించిన బాధితురాలు..
అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతో భవిష్యత్తులో ఎలాంటి సహాయం చేయనని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. వారి సూచన మేరకు చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు కిషన్‌సింగ్‌పై 354(D)కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని మరిన్ని వివరాలు, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మహిళలకు అండగా ఉండాల్సిన పోలీస్ అధికారే ఇలా లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపుతోంది. తక్షణమే డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సదరు డీఎస్పీ రాసలీలల వ్యవహారం తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.