/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ycp-vs-tdp-flag-jpg.webp)
వైసీపీ(ycp), టీడీపీ(tdp) కార్యకర్తలు మరోసారి బాహాబాహీకి దిగారు. చిత్తూరు జిల్లా(chitoor district) పూతలపట్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మరోసారి ఘర్షణ పీక్స్‌కు వెళ్లింది. నాలుగు రోడ్ల కూడలిలో ఇరు వర్గాల మధ్య రచ్చ జరిగింది. చంద్రబాబు బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేయడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.
కొనసాగుతోన్న బంద్:
మరోవైపు నిన్న పుంగనూర్‌లో వైసీపీ,టీడీపీ మధ్య రాళ్ల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలే కాకుండా పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ ఘర్షణలకు టీడీపీని కారణమని ఆరోపిస్తూ ఇవాళ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ బంద్‌కి పిలుపునిచ్చింది. దీంతో చాలా దుకాణాలను మూసివేశారు. కొందరు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు క్లోజ్ అయ్యాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కలేదు. ఉదయం నుంచి రోడ్డుపైకి వచ్చి బంద్ పాటిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. పలు చోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఏపీ డీజీపీ సీరియస్:
పుంగనూరు ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అంతేకాదు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టాలని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లను ఆదేశించారు. దాడిలో పోలీసులకు గాయాలయ్యాయని, కావాలనే వాహనాలకు నిప్పుపెట్టారని డీజీపీ పేర్కొన్నారు. రాళ్లదాడికి పాల్పడిన వారిని అధికారులు గుర్తించారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నామని, ఇప్పటికే పలువురు అనుమానితులను గుర్తించామని, మరికొందరి కదలికలపై కూడా నిఘా ఉంచామన్నారు డీజీపీ. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్చారనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని డీజీపీ తెలిపారు.
ఘటనకు బాధ్యులైన వారిపై ప్రాథమిక సమాచారం ఉందని, రెచ్చగొట్టే ప్రసంగాలపై దృష్టి సారిస్తున్నామన్నారు డీజీపీ. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. ఇక పుంగనూరు ఘటనకు సంబంధించి ఇప్పటికే పలు అరెస్టులు జరగగా.. వారిలో ఎక్కువగా టీడీపీ వారే ఉన్నట్టు తెలుస్తోంది. IPC సెక్షన్ 147, సెక్షన్ 148, సెక్షన్ 332, సెక్షన్ 353,సెక్షన్ 128B, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం, ప్రభుత్వ అధికారులపై దాడులు, విధినిర్వహణలో దాడి, దొమ్మీ, ముందస్తు ప్రణాళికతో దాడి అభియోగాలను మోపినట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు రాయలసీమ టూర్‌లో భాగంగా మిగిలిన చోట్ల ఇలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పుంగనూరు ఎపిసోడ్ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పొలిటికల్ హీట్:
మరోవైపు చంద్రబాబుపై వైపీపీ ఎమ్మెల్యేలు విమర్శల దాడి మొదలుపెట్టారు. నిన్న పుంగనూరులో జరిగిన ఘటన అమానుషమన్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని ఆరోపించారు. ప్రసంగం నుంచి వైసీపీ వారిపై దాడికి పాల్పడే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని విమర్శించారు.