/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/china.jpg)
విపత్తులకు, విలయాలకు, వినాశాలకు చైనా కేరాఫ్‌గా మారిపోనుందా..? నాలుగేళ్లుగా నిత్యం ఏదో ఒక రూపంలో డ్రాగన్‌పై ప్రకృతి విరుచుకుపడుతూనే ఉంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఇసుకు తుపానులు, భారీ వర్షాలు, వరదలు, వడగాలులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిఏడాది డ్రాగన్‌ని పలకరిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా చైనాపై ప్రకృతి కన్నెర చేసిందట. చైనా వాతావరణ శాఖ చేసిన ప్రకటన చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. ఈ నెలలో(జులైలో) ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కరోనా నుంచి మొదలు:
ప్రపంచంలో అందరికంటే ముందుగా చైనాపై దాడి చేసింది కరోనానే. అయితే కఠిన లాక్‌డౌన్‌తో కరోనా నుంచి త్వరగానే కోలుకుంది. ఆ తర్వాత భారీ వర్షాలు చైనాను ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో పాటు రోడ్లన్ని నదులను తలపించాయి. 2021లో హెనాన్ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలకు అధికారికంగానే వందలాది మంది చనిపోయారు. ఇక అనాధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు కూడా జులైలోనే వరదలు సంభవించాయి. 2021, జులై 20న హెనాన్ ప్రావిన్స్‌లో ఒక్క గంటలోనే 20సెంటీమీటర్ల వర్షం పడినట్టు చైనా మీడియా చెప్పింది. వరద నీటిలో తేలియాడుతున్న కార్లు అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక గతేడాది కూడా జులైలో వరదలు సంభవించాయి. కింగ్‌యాంగ్‌లోని నది వెంబడి వరద నీటిలో వంతెన కొట్టుకుపోయింది. ఆ ప్రమాదంలో 12మంది గల్లంతయ్యారు. ఇక ఈ ఏడాది కూడా జులైలో ప్రకృతి దాడి చేస్తుందని కథనాలు వస్తుండడం అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/china.jpg)
ఎండా..వాన..:
ప్రస్తుతం చైనాలో చిత్రవిచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండాలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. షాన్‌షి ప్రావిన్సులో గడిచిన 50ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు చాంగ్‌కింగ్‌లో రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పలు ప్రావిన్స్‌ల్లో మొత్తం కలిపి దాదాపు 5లక్షల మంది ప్రభావితమయ్యారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రాణ నష్టం జరగకుండా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు సర్వేలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈ పరిస్థితికే అక్కడి ప్రజలు భయపడుతుంటే..తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన అలెర్ట్ మరింత కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో..ఈ జులైలోనే తీవ్ర తుపాన్లు. టైఫున్లు వచ్చే అవకాశం ఉందని.. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు విస్తాయని..ఇలా ఒక్క ప్రావిన్స్‌కి మరో ప్రావిన్స్‌కి సంబంధంలేకుండా వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. వాతావరణ శాఖ అంచనాకు తగట్టే సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా.. రాజధాని బీజింగ్‌లో గత 60ఏళ్లలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.