Child Abuse: కొన్నిరోజులుగా తెలుగురాష్ట్రాల్లో ప్రజలకు తెల్లవారుతోంది అంటేనే భయం వేస్తోంది. ఎప్పుడు ఎలాంటి అఘాయిత్యపు వార్తలు వినాల్సి వస్తుందో అని టెన్షన్ మొదలవుతోంది. దీనికి కారణం ఒక్కటే ఇటీవల కాలంలో దారుణమైన సంఘటనలకు ఇటు ఏపీ.. అటు తెలంగాణ కేంద్రంగా మారాయి. ఎప్పుడూ.. కనీ, వినీ ఎరుగని విధంగా చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపించే వికృతమైన సంగతులు.. ప్రజల మనసులను గతి తప్పేలా చేస్తున్నాయి.
ఇప్పుడు ఏపీ నుంచి ఈ హెడ్ లైన్స్ చూడండి..
- తిరుపతి జిల్లాలో జూలై 17న హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక
- విశాఖపట్నంలో జూలై 17న మైనర్ బాలికపై 20 ఏళ్ల యువకుడు దాడికి పాల్పడ్డాడు
- గుంటూరు జిల్లాలో జూలై 15న జరిగిన మరో ఘటనలో గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో 8వ తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.
- అనంతపురం జిల్లాలో, జూలై 14 న, ఒక ఫోటోకాపీ దుకాణం యజమాని ఒక బాలిక పై దౌర్జన్యానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.
- నంద్యాల జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు యువకులు జులై 7న సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు.
- అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పిగొండపాలెం గ్రామంలో జూలై 6న బి. సురేష్ (26) అనే వ్యక్తి 13 ఏళ్ల బాలికను ఆమె ఇంట్లోనే కత్తితో నరికి చంపాడు.
Child Abuse: ఈ హెడ్ లైన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తోంది. ఇందులో కామం పాయింట్ (మీరు సరిగానే చదివారు) కనిపిస్తోందా. అదీ కూడా కామన్ గా ఉండే విషయం అర్ధం అయింది కదా. ప్రపంచం అంటే ఏమిటో సరిగా తెలీని ఆడబిడ్డలే ఈ అన్ని దారుణాల్లోనూ టార్గెట్. వయసుతో పని లేదు ఆడపిల్ల అయితే చాలు అన్నట్టుగా కామాంధులు రెచ్చిపోతున్న పరిస్థితి.
ఇక తెలంగాణాలో జరిగిన ఈ సంఘటనలు చూడండి..
మహబూబాబాద్ కు చెందిన బానోత్ నరేశ్ అనే వ్యక్తి అశ్లీల వీడియోలు చూస్తూ అదే ధ్యాసలో పడి తన కన్నకూతురు (12) పై లైంగికదాడికి ప్రయత్నించి.. అది సాధ్యం కాకపోవడంతో ఆమెను నేలకేసి కొట్టి చంపేశాడు. జూన్ 7న ఇది జరిగింది
హైదరాబాద్ లో తండ్రి లేని ఒక బాలిక (15) పై ఆమె ఫ్రెండ్ తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఈవిషయంపై చైల్డ్వెల్ఫేర్ అధికారులను సంప్రదించి.. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ సంఘటనల్లో కూడా ఒక కామం పాయింట్ ఉంది. అది వావివరసలు చూడకుండా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడటం.
Child Abuse: ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈమధ్యకాలంలో వరుసగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో చాలా వరకూ అశ్లీల వీడియోలను చూసి దుర్మార్గులు ప్రేరేపితం కావడమే కనిపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని జుగుప్సాకరంగా ఉపయోగించుకుంటున్న కొందరు కామధానాంధులు.. (ఇది కూడా కరెక్టే) ఇంటర్నెట్ నుంచి డబ్బు సంపాదించడం కోసం చేస్తున్న కామాంతక వీడియోల వాళ్ళ తలెత్తున్న దురవస్థ ఇది. నియంత్రించలేని స్థితికి చేరిపోయిన అశ్లీల చిత్రాలు నెట్టింట చేస్తున్న కరాళ నృత్యాల పాదాల కింద ఈవిధంగా చిన్నారులు నలిగిపోతున్నారనేది వాస్తవం.
ఇప్పుడు ఇవి మన పక్క ఊరిలోనో.. జిల్లాలోనో జరిగిన సంఘటనల్లా కనిపిస్తున్నాయి. కానీ, ఇవి మన పక్కింటికి.. తరువాత మన ఇంటిమీదకు చేరే అవకాశాలు లేవని అనుకోలేం. సంఘటనలు జరిగాకా ఫోటోలు బ్లర్ చేసి మీడియా చేసే హంగామా చూసి అయ్యో అనుకోవడం తప్ప.. మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు పడిపోయారు.
అదుపు చేయలేరా?
ఈ కామరక్కసిని అంతం ఎలానూ చేయలేరు. కనీసం అదుపు చేయడం కూడా క్లిష్టమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే, తనకు ఏమి జరుగుతుందో కూడా తెలీని బిడ్డలు.. తమపై జరిగేది అత్యాచారం అని గొంతెత్తి అరవలేని స్థితిలో నిస్సహాయంగా బలి అయిపోతున్నారు. కామాంధుల చేతిలో నిర్జీవంగా వారు మరిన తరువాతే విషయం వెలుగులోకి వస్తోంది. కరోనా లాంటి వైరస్ కు టీకా కనిపెట్టగలిగారు.. కానీ.. ఈ అశ్లీల వీడియోలను చూసి అఘాయిత్యాలకు పాల్పడే జబ్బుకు మందు కనిపెట్టడం అంత ఈజీ కాదు.
సామాజిక చైతన్యమే అవసరం..
Child Abuse: ఎవరి బిడ్డల్ని వారు రక్షించుకోవడమే అందరూ చేయాల్సిన పని. ముఖ్యంగా తల్లులు చేయాల్సిన పని. పిల్లలు ఏ చిన్న విషయం జరిగినా తల్లితో చెప్పుకునేలా వారితో బంధం ఏర్పరుచుకోవాలి. పిల్లల్ని నిత్యం గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లల్ని. వారు చిన్న తేడాగా కనిపించినా విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే పెద్దగా సీరియస్ గా చేసుకోరు. అందులోనూ తమపై ఎవరైనా తప్పుగా చేయి వేయడం వంటివి చేశారని చెబితే.. “నువ్వు జాగ్రత్తగా ఉండు” అనే చెబుతారు. కానీ, దానికి కారణమైన వారిని గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ పధ్ధతి మారాలి. ఆడబిడ్డ తనకు వచ్చిన అనుమానం చెబితే కచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. అలాగే గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ వంటి వాటిని వారికి స్పష్టంగా తెలిసేలా చేయాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఆడబిడ్డల్ని రక్షించుకోవడంకోసం తల్లులు తమ భర్తల్ని కూడా అనుమానంగా చూడాల్సిందే అనిపిస్తోంది. ఇది పెద్ద మాటగా అనిపించవచ్చు. కానీ, జరుగుతున్న సంఘటనలు అటువంటి ఆలోచన చేసేలా చేస్తున్నాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా.. ఇలా వేధింపులకు గురైన పిల్లలు సరిగా నిద్రపోకపోవడం, స్కూల్ కు వెళ్ళడానికి అయిష్టాన్ని ప్రదర్షించడం, నిద్రలో పక్క తడపడం, తరచూ భయపడుతూ ఉండడం వంటివి చేస్తుంటారు. అలాగే టీనేజ్ లో పిల్లలు డిప్రెషన్లోకి వెళ్లిపోవడం.. కోపంగా కనిపిస్తూ ఉండడం.. ముభావంగా ఉండడం చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సైక్రియాట్రిస్ట్ దగ్గరకు పిల్లలను తీసుకు వెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం.
ఇక చివరిగా సామాజిక చైతన్యం చాలా అవసరం. ప్రభుత్వం.. ఎన్జీవోలు చొరవ తీసుకోవాలి. గ్రామ స్థాయిలో పట్టణాల్లో అయితే వార్డు స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పై ప్రత్యేక కార్యక్రమాలను అన్ని స్థాయిల్లోనూ నిర్వహించాలి. సామాజికంగా చైతన్యం కలిగిస్తే ఇలాంటి తీవ్రమైన.. అసహ్యకరమైన.. దారుణమైన.. ఘటనలను నివారించే అవకాశం ఉంటుంది.