Konda Vishweshar Reddy: మనిషి గట్టిగా అనుకోవాలే కానీ ఏదైనా సాధించవచ్చు. తాను అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వాలు సహకరించకపోయినా ఒంటిరాగా పోరాడి గెలిచిన వారెందరో ఉన్నారు. అలాంటిదే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా చేసి చూపించారు. చేవెళ్ల యువతతో కలిసి అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. రెండేళ్ల క్రితం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఓ సరస్సులో వాటర్ బైక్ నడిపారు. అది బాగా నచ్చడంతో అలాంటి బైక్‌నే ఇండియాలో ఎందుకు తయారుచేయకూడదనే ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని 2021లోనే ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇప్పుడు ఆ ఆలోచనను నిజం చేసి చూపించారు. ఇందుకోసం చేవెళ్ల, వికారాబాద్ యువతకు కావాల్సిన ప్రోత్సాహం, సహాయం అందించారు. దీంతో నైపుణ్యం ఉన్న యువత కూడా వాటర్ బైక్స్‌ను తయారుచేసి శభాష్ అనిపించింది. ఇప్పుడు ఇదే విషయాన్ని కొండా ట్వీట్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ చేసిన యువతను ఆయన అభినందించారు. మొత్తం మూడు రకాల మోడల్స్ ఆవిష్కరించారు.
ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాలు విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. అయితే 2018 నవంబరులో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2021లో కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి తొమ్మిది లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి