Charlie Chaplin: హాస్యానికి కేరాఫ్ ఎడ్రస్.. ది వన్ అండ్ ఓన్లీ కామెడీ కింగ్ చార్లీ చాప్లిన్!

ప్రపంచాన్ని నవ్వులతో ముంచెత్తిన వాడు.. ప్రపంచ సినిమా పై చెరగని కామెడీ సంతకాన్ని చేసిన వాడు.. దశాబ్దాలు దాటినా పేరు చెబితేనే ప్రజల పెదవులపై చిరునవ్వులు పూయించగలిగిన వాడు చార్లీ చాప్లిన్. ఈరోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా చాప్లిన్ జీవిత విశేషాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
Charlie Chaplin: హాస్యానికి కేరాఫ్ ఎడ్రస్.. ది వన్ అండ్ ఓన్లీ కామెడీ కింగ్ చార్లీ చాప్లిన్!

Charlie Chaplin: ఇప్పుడు మనం చూస్తున్న కామెడీ సినిమాల్లో హాస్యం ఎలా పుడుతుంది? అయితే ఆ సన్నివేశాల్లోని డైలాగ్ ల వల్ల (చాలా సార్లు ఇవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయి ఉంటాయి) లేదా.. ఆ సన్నివేశం వచ్చిన సందర్భం వలన అంతే కదా. అది కూడా సినిమా చూసి బయటకు వచ్చాకా గుర్తుండే హాస్యం చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ, దాదాపుగా నూట పదేళ్ల క్రితం.. కష్టాల్లో పుట్టి.. కష్టాలనే మెట్లమీదే జీవితాన్ని గడుపుతున్న యువకుడు సృష్టించిన హాస్యం ఇప్పటికీ మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతూనే ఉంది. దశాబ్దాలు గడిచిపోయినా.. ఇప్పటికీ ఆయన గుర్తుకువస్తే చాలు మన పెదవులపై చిరునవ్వును పూయిస్తుంది. మనిషి జీవితం నుంచే ఆయన హాస్యాన్ని పండించారు. ఆయన సినిమా చూస్తూ ఎంత హాయిగా నవ్వుకోగలమో.. ఆ నవ్విస్తున్న సినిమా పాత్రల వెనుక విషాదం అంతే బలంగా మన హృదయాల్ని తాకుతుంది. ఆయన సినిమాల్లో మనిషి జీవితం కనిపిస్తుంది. మనిషి ప్రవర్తన కనిపిస్తుంది. మనిషిలోని ఉత్తమ గుణం.. దిగజారుడు తనం రెండూ పక్క పక్కనే కనిపిస్తూ మనల్ని హాస్య ఒరవడిలో ముంచేస్తాయి. ఇంత చెప్పాకా ఆయన ఎవరో మీకీపాటికే అర్థం అయిపోయి ఉంటుంది. అవును.. ఆయనే ది గ్రేట్ చార్లీ చాప్లిన్(Charlie Chaplin). ఏప్రిల్ 16, 1889న ఈస్ట్ లేన్, వాల్‌వర్త్‌లో రాత్రి ఎనిమిది గంటలకు అత్యంత బీద స్థితిలో పుట్టిన చాప్లిన్ అదే కష్టాల మధ్యలో నాటకం.. సినిమా దారిని వెతుక్కుని అప్పట్లోనే ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడిగా ఎదిగారు. ఆ క్రమంలో ప్రపంచ సినిమాపై ఆయన అందించిన చిరునవ్వుల వెలుగులు ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాయి. చార్లీ చాప్లిన్(Charlie Chaplin) జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

కష్టాల కడలిలో..
చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్(Charlie Chaplin) తండ్రి గాయకుడు, నటుడు. అతని తల్లి లిల్లీ హార్లే స్టేజ్ ఆర్టిస్ట్.. మంచి గాయని కూడా. అందుకే చాప్లిన్ వారసత్వంగానే కళాకారుడు అయ్యారు. అయితే, చాప్లిన్ తండ్రి అతని చిన్నతనంలోనే మరణించాడు. ఆ తరువాత తల్లి మానసిక అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో చాప్లిన్ తన పదేళ్ల వయసులోనే బతుకు కోసం వీధిన పడాల్సి వచ్చింది. తన సోదరుని ఆలనా పాలనా కూడా తానే చూసుకోవాల్సి వచ్చింది. ఆ పనీ.. ఈ పనీ చేస్తూ బతుకుబండిని లాగిస్తున్న చాప్లిన్ కు  "ది ఎయిట్ లంకేషైర్ లాడ్స్" అనే చిన్నారుల గ్రూప్ లో బాల కళాకారుడిగా అవకాశం దక్కింది. అక్కడ చాప్లిన్ అత్యుత్తమ డాన్సర్ గా పెద్ద పేరు సంపాదించుకున్నాడు. 

1915 సంవత్సరం వచ్చేసరికి చాప్లిన్(Charlie Chaplin) హాస్య కళాకారుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ సమయంలో చాప్లిన్ కార్టూన్ స్ట్రిప్స్ విపరీతమైన ఆదరణ పొందాయి. చాప్లిన్ ఆ సంవత్సరంలో ఎంత ఎదిగాడంటే.. యూనివర్సల్ , ఫాక్స్ వంటి స్టూడియోల నుంచి భారీ పారితోషికాన్ని అందుకునేంతగా. తరువాత  ఆయన మ్యూచువల్ ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి వారానికి 10 వేల డాలర్ల రెమ్యునరేషన్ తీసుకునేట్టుగా ఒక ఒప్పందం కుదిరింది. అప్పట్లో అది ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అంటేనే చాప్లిన్ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. 

1921లో దర్శకుడిగా మారిన చాప్లిన్ వరుసగా ది కిడ్ (1921), ఎ ఉమెన్ ఆఫ్ పారిస్ (1923), ది గోల్డ్ రష్ (1925), సర్కస్ (1928), సిటీ లైట్స్ (1931),మోడరన్ టైమ్స్ (1936), ది గ్రేట్ డిక్టేటర్ (1940), మాన్సియర్ వెర్డౌక్స్ (1947), లైమ్‌లైట్ (1952), ఎ కింగ్ ఇన్ న్యూయార్క్ (1957), హాంకాంగ్ నుండి ఒక కౌంటెస్ (1967) సినిమాలు తీసుకువచ్చారు. ప్రతి సినిమా సూపర్ హిట్. హృదయానికి హత్తుకునే కథనంతో.. హాస్య కోణంలో సాధారణ ప్రజల జీవితాన్ని ఈ సినిమాలన్నీ ఆవిష్కరించాయి. మూడు ఆస్కార్ అవార్డులతో పాటు ఉత్తమ నటుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు, BAFTA ఫెలోషిప్, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా జీవిత సాఫల్య పురస్కారం, ఫిల్మ్ సొసైటీ ఆఫ్ లింకన్ సెంటర్ అవార్డు, వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి కెరీర్ గోల్డెన్ లయన్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 

వివాదాలూ ఉన్నాయి..
అత్యంత విజయవంతమైన సినిమా నటుడిగా, దర్శకుడిగా, ఎడిటర్ గా.. ప్రపంచవ్యాప్తంగా తరతరాలకు సరిపడేంత కీర్తి గడించిన చాప్లిన్(Charlie Chaplin) జీవితంలో వివాదాలూ ఉన్నాయి. హిట్లర్ స్టోరీతో ది డిక్టేటర్ సినిమా తీసినపుడు ప్రపంచవ్యాప్తంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, సినిమా విజయవంతం అయింది. అయితే, ఆయన వ్యక్తి గత జీవితంలో పెద్ద మచ్చ పడింది. ఒక నటి తన బిడ్డకు తండ్రి చాప్లిన్(Charlie Chaplin) అంటూ ప్రకటించింది. దానిని ఆయన అంగీకరించలేదు. దీంతో ఆమె కోర్టుకెక్కింది. చాలా రోజులు కోర్టులో ఆ కేసు నడిచింది. చివరికి రక్త పరీక్షల ద్వారా ఆమె చెప్పింది కరెక్ట్ అని కోర్టు నిర్ధారించింది. ఆ బిడ్డకు 21 ఏళ్ళు వచ్చేవరకు భరణమ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా చాప్లిన్ ఊనా ఓ'నీల్ ను పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం ఈ ఇద్దరూ కలిసే ఉన్నారు. వీరికి ఎనిమిది మంది పిల్లలు కలిగారు. 

మొత్తంగా కష్టాలను కథలుగా మార్చి.. ప్రపంచ ప్రేక్షకులు మెచ్చేవిధంగా హాస్యాన్ని రంగరించి చాప్లిన్ అందించిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. డైలాగులు లేకుండా.. మూకీ సినిమాల్లో తన ఆహార్యం.. నటనతో హాస్యాన్ని పండించి.. అందరినీ నవ్వులతో ముంచెత్తిన నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్. అప్పటికీ ఇప్పటికీ చాప్లిన్ స్థానాన్ని భర్తీ చేయగలిగిన ప్రతిభావంతుడు మరొకరు ప్రపంచ సినిమాలో రాలేదంటే.. అది అతిశయోక్తి కాదు. 

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు