Gadwal: ప్రపంచ దేశాలు గర్వించేలా చంద్రాయన్-3 సక్సెస్ చేశారు మనదేశ శాస్త్రవేత్తలు. అయితే, వినూత్న రీతిలో చంద్రయాన్ 3 సెటప్ ను కళ్ళకు అద్దం పట్టినట్టుగా చిత్రీకరించారు గద్వాల చేనేత సంఘం నాయకులు. ప్రజలందరూ ఆకర్షించేలా గణపతి మండపం ఏర్పాటు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. చంద్రాయన్ 3 డెకరేషన్ తో ఏర్పాటు చేసిన గణేష్ మండపం ప్రజలను ఎంతోగానో ఆకట్టుకుంటుంది.
జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal) కేంద్రంలో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పద్మశాలి కులస్తులు వినాయకుని విగ్రహం వద్ద వినూత్నంగా చంద్రయాన్ 3 డెకరేషన్ ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..గద్వాల పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో చేనేత కార్మికులు చంద్రాయన్ 3 డెకరేషన్ తో ఏర్పాటు చేసిన గణేష్ మండపంను రెడీ చేశారు.
చంద్రయాన్-3 విజయం కావడంతో.. ఆ ప్రయోగాన్ని వినాయకచవితి సందర్భంగా ప్రజలకు ప్రత్యక్షంగా చూయించాలనే ఉద్దేశ్యంతో చంద్రయాన్ 3 సెటప్ తో వినాయక మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపం తయారు చేసేందుకు నెల రోజులు కష్టపడినట్లు నిర్వహకులు తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ప్రజలకు వివరించేలా, అర్థం అయ్యేలా ఏర్పాటు చేశామని వారు తెలిపారు. చేనేత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో లక్ష రూపాయలు వరకు ఖర్చు అయిందన్నారు. వినాయకుడి దగ్గరికి వచ్చే భక్తులకు చంద్రయాన్ 3 కల్లారా చూసినట్లు అనిపిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.