'పెన్నా టు వంశధార'.. ప్రాజెక్టులపై పోరుబాటకు చంద్రబాబు సిద్ధం

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు తెలుగు నేలకు జలహారం పేరిట పెన్నా నుంచి వంశధార వరకు ప్రాజెక్టుల సందర్శన చేయనున్నారు.

New Update
'పెన్నా టు వంశధార'.. ప్రాజెక్టులపై పోరుబాటకు చంద్రబాబు సిద్ధం

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విజయంతో మంచి జోరు మీదున్న సైకిల్ పార్టీ ప్రజల్లోనే ఉండేందుకు ప్రణాళికలు రచించింది. ఓ వైపు యువనేత నారా లోకేశ్ పాదయాత్రతో జనాల్లోనే ఉంటూ వారి సమస్యలు వింటున్నారు. మరోవైపు అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రెస్‌మీట్లు పెడుతన్నారు. తాజాగా ఏపీలో ప్రాజెక్టుల సందర్శనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు తెలుగు నేలకు జలహారం పేరిట పెన్నా నుంచి వంశధార వరకు ప్రాజెక్టుల సందర్శన చేయనున్నారు. క్షేత్రస్థాయిలో వాటి స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు.

మంగళవారం(ఆగస్టు 1) మచ్చుమర్రి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పరకచర్ల హెడ్ రెగ్యులేటర్ సైతం సందర్శిస్తారు. బుధవారం(ఆగస్టు 2) జమ్మలమడుగు, పులివెందులలో చంద్రబాబు పర్యటన సాగనుంది. కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో రోడ్ షో, భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆగస్టు 3న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్‌లను సందర్శిస్తారు. అనంతరం పెనుగొండ పరిధిలోని కియా కార్ల ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఆగస్టు 4న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్‌ కెనాల్‌ సందర్శించనున్నారు. అనంరం పూతలపట్టులో రోడ్‌ షో, అనంతరం బహిరంగ సభలో ప్రసగించనున్నారు.

రాయలసీమలో సిరులు పండాలంటే ఆ ప్రాంతానికి ఇప్పటివరకు ఎవరు చేయనటు వంటి ద్రోహం చేసిన జగన్ అధికారం నుంచి పోవాల్సిందే అనే నినాదంతో చంద్రబాబు ముందుకెళ్లనున్నారు. పర్యటన తొలి దశలో భాగంగా పెన్నా నది నుంచి నాగావళి వరకు వివిధ నదులపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టనున్నారు. కాగా రాష్ట్రంలో ఇటీవల సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై 'పడకేసిన ప్రాజెక్టులు-ప్రజా ద్రోహి జగన్ ' అంటూ మూడు రోజులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో మొత్తం 64 ప్రాజెక్టులు మొదలుపెట్టి 23 పూర్తి చేశామని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 4 శాతం ప్రాజెక్టుల పనులు చేసిందని విమర్శించారు. ఇకపై ప్రజా క్షేత్రంలోనే ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని టీడీపీ నేతలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు