Chandrababu: ఈ విషయం జీవితంలో మర్చిపోలేను.. టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.!

కూటమి ఘనవిజయానికి కారణమైన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు. అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

New Update
Ap Cabinet : నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్!

Chandrababu: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు. కూటమి ఘనవిజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..  కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తల కష్టం, కృషి ఎంతో ఉందన్నారు.  20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి మనం గెలిచామని.. ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నాని అన్నారు. కూటమి విజయం సాధారణమైంది కాదని.. ప్రజలు నమ్మకంతో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కామెంట్స్ చేశారు. కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్ తో..57 శాతం ఓట్ షేర్ ను సాధించిందన్నారు. 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందని.. ఈ విజయం వెనక నేతలు, కార్యకర్తలు నిలబడిన తీరు, ఐదేళ్లు పడ్డ కష్టం ఉందని వ్యాఖ్యానించారు. గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీలు వచ్చాయన్నారు.

జీవితంలో మర్చిపోలేను..

పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ రూరల్, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకు పైన మెజారిటీ వచ్చిందని.. కార్యకర్తలు, నేతలు పోటీ పడి పని చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. విశాఖ, శ్రీకాకుళం, అమలాపురం, గుంటూరు ఎంపీ స్థానాల్లో 3 లక్షలకు పైగా మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. గత ఐదేళ్లు మీరు పడ్డ కష్టాలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయన్నారు. ఎన్నికల్లో కార్యకర్తల పాత్ర మర్చిపోలేనిదని.. పసుపు జండా పట్టుకుంటే చెయ్యి విరగొట్టారని..జై తెలుగుదేశం అంటే గొంతు కోశారని..అయినా కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసి పార్టీ కోసం పని చేశారన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారని..కొందరు ఆస్తులు కోల్పోయారని.. ఇంకొందరు జైలు పాలయ్యారని అన్నారు. కార్యకర్తల కష్టాలు, వారిపై వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. మీ త్యాగం నా జీవితంలో మర్చిపోలేనని కార్యకర్తలతో, నేతలతో మాట్లాడారు.

కక్షసాధింపు తగదు..

కింద స్థాయి నుంచి ఎవరు..ఎక్కడ ఏం పని చేశారో అధ్యయనం చేస్తున్నామని.. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయని. ఎలా చేయాలి.. వారికి ఏం చేయాలి అనే విషయంలో ఆలోచనలు చేస్తున్నామన్నారు. అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవీగడం చేయవద్దన్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలను విస్మరించ కూడదన్నారు. ప్రజలు తప్పుపట్టేలా ఎటువంటి పనులు చేయొద్దని.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని మనం కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇంత పొలిటికల్ వేవ్ లేదని.. కూటమి విజయానికి సహకరించిన ప్రజలను మనం ఆదుకోవాలని అన్నారు. ఎన్నికల ముందు సూపర్-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రకటించామని.. ఇచ్చిన హామీలను తప్పుకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల మెగాడీఎస్సీ ఫైలుపై సంతకం చేసి 16,347 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్ రూ.4 వేలకు పెంపుపై మూడో సంతకం, స్కిల్ గణనపై నాలుగో సంతకం, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై ఐదో సంతకం చేశామని వివరించారు.

Also Read: అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు.. వారిని దూరం పెట్టనున్న ప్రభుత్వం..!

2047 నాటికి..

యువతలో నైపుణ్యం ఏ మేరకు ఉందో గణన చేసి అవసరమైన అవకాశాలు కల్పిస్తామని.. నైపుణ్య గణనతో జీవన ప్రమాణాలను మార్చడానికి కూడా అవకాశం ఉంటుందని అన్నారు. 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో.. వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా పథకాలు అమలు చేస్తామన్నారు. 2047 నాటికి మన దేశం ఉన్నత స్థాయిలో ఉండాలని..అందులో తెలుగువారు నెంబర్ -1 గా ఉండాలి అనేది తన ఆకాంక్ష అన్నారు. దాని కోసం కష్టపడతానన్నారు.. పార్టీ కార్యకర్తలకు గౌరవం, ప్రాధాన్యత ఉండేలా నేతలు నడుచుకోవాలని.. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.

పాజిటివ్ గవర్నెన్స్..

తాను తరుచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతానని.. జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళతానని అన్నారు. నేతలు కూడా జిల్లాల్లో పార్టీ కార్యాలయానికి వెళ్లాలని.. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి ఇబ్బందులు పరిష్కరిస్తేనే వారిలో మనోబలం పెరుగుతుందన్నారు. గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించామని..ఇక ముందు కూడా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఇప్పటికే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామని.. పాజిటివ్ గవర్నెన్స్ ను తీసుకొస్తున్నామని అన్నారు.  పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారన్నారు. అందరం కలిసి పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని బీజేపీ కూడా ముందుకు వచ్చిందన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారన్నారు.

ఇదే ఫలితాలు..

నాయకుడు ఎలా ఉండకూడదో..ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో జగన్ ఒక కేస్ స్టడీ అని.. పాలన ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా, ఆదర్శంగా పాలన సాగిద్దామని అన్నారు.  2029 ఎన్నికలకు ఇప్పటి నుండే కృషి చేయాలన్నారు. ప్రజలతో మమేకమైతే ఇదే ఫలితాలు 2029లో వస్తాయని.. అహంకారానికి దూరంగా, బాధ్యతగా, చిత్తశుద్దితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపై ప్రజల్లో చర్చ విస్తృతంగా జరగాలన్నారు. పార్టీలోని ప్రతి కమిటీ ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తామని. ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోనని.. ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు