స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీంతో ఈ నెల 17న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ పిటిషన్ పై విచారణ పలు మార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తప్పనిసరిగా కోర్టు తీర్పు వస్తుందన్న భావన వ్యక్తం అయింది. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనలో ఉన్న టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు కూడా ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే.. విచారణ మరోసారి వాయిదా పడడంతో వారంతా నిరాశకు గురయ్యారు. అరెస్ట్ అయ్యి నెల రోజులు దాటినా.. చంద్రబాబుకు బెయిల్ రాకపోవడం, కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా వాదనలన్నీ 17ఏ సెక్షన్ చుట్టే తిరిగాయి. విచారణ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తూ.. అవినీతిపరులను రక్షించేందుకు 17ఏ చట్టసవరణ పరికరం కాకూడదని వాదించారు. సెక్షన్ 19 మాదిరిగా 17ఏ సంపూర్ణంగా కేసు నమోదుకు నిరోధం కల్పించలేదని న్యాయస్థానానికి తెలిపారు.
కనీసం పోలీసులు విచారణ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా అని వాఖ్యానించారు. అసలు ఎంక్వయిరీ విషయంలోనే నిరోధం ఉన్నప్పుడు కేసులు ఎలా ఫైల్ చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే.. 17ఏ అనేది పుట్టకముందే నేరం జరిగింది కాబట్టి ఈ కేసుకు చట్టసవరణ వర్తించదని రోహత్గీ కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.