చంద్రబాబు పులివెందుల రోడ్‌షోపై ఉత్కంఠ.. రాయలసీమలో వేడెక్కిన రాజకీయం

ఇవాళ(ఆగస్టు 2) చంద్రబాబు పులివెందుల పర్యటనపై సస్పెన్స్‌ నెలకొంది. 2019లో టీడీపీ ఓటమి తర్వాత తొలిసారిగా సీఎం జగన్‌ సొంతగడ్డపై చంద్రబాబు కాలు మోపనున్నారు. రోడ్‌షో, బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతిపై గందరగోళం నెలకొని ఉంది. రోడ్ షో సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

author-image
By Trinath
New Update
చంద్రబాబు పులివెందుల రోడ్‌షోపై ఉత్కంఠ.. రాయలసీమలో వేడెక్కిన రాజకీయం

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు(chandra babu naidu) ఇవాళ(ఆగస్టు 2) సీఎం జగన్‌(cm jagan) సొంతగడ్డలో పర్యటించనుండడం కాక రేపుతోంది. జగన్‌ సొంతగడ్డ అయిన పులివెందులలో టీడీపీ అధినేత రోడ్‌షో నిర్వహించనుండడంతో రాయలసీమలో మళ్లీ రాజకీయ వేడి రాజుకున్నట్టే కనిపిస్తోంది. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు నిన్న(ఆగస్టు 1) నంద్యాల జిల్లాలో పర్యటించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించారు. ఇక ఇవాళ(ఆగస్టు 2) పులివెందుల పట్టణంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అయితే చంద్రబాబు పులివెందుల పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం!

ఏం జరగబోతోంది?
చంద్రబాబు పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరణ ఓవైపు.. మరోవైపు రోడ్‌షో చేసి తీరుతామంటున్న తెలుగు తమ్ముళ్లతో పులివెందులలో ఏం జరగబోతుందన్న టెన్షన్ నెలకొంది. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా అటు ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు నిన్న రాత్రి జమ్మలమడుగులో బస చేశారు. ఇవాళ రంగనాథస్వామి ఫంక్షన్‌హాలు నుంచి బయల్దేరి 11.30కు కొండాపురం మండలంలోని గండికోట సీబీఆర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను పరిశీలిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి ఇవాళ(ఆగస్టు 2)మధ్యాహ్నం 3గంటలకు పులివెందుల చేరుకుంటారు. జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతంలో గండికోట, చిత్రావతి ప్రాజెక్టుల ఎత్తిపోతల పధకాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. పునరావాస ప్యాకేజీల కోసం ప్రజలు పోరాడుతున్న గండికోట రిజర్వాయర్‌తో పాటు దాని పరిసర గ్రామాలను చంద్రబాబు సందర్శించనున్నారు. గతంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన హింసాకాండ దృష్ట్యా.. వులివెందులో అలాంటి ఘటనలు జరగకూడదని పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. రోడ్ షో సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పులివెందులకు బాబు వస్తుండడంతో ఒక్కసారిగా రాయలసీమ రాజకీయం వేడెక్కింది. ఒకవేళ చంద్రబాబుకు పులివెందుల బహిరంగ సభకు అనుమతి లభిస్తే టీడీపీ అధినేత విమర్శనస్త్రాలు సంధించడం ఖాయం. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై చంద్రబాబు బహిరంగ విమర్శలు చేసే అవకాశాలు క్లియర్‌కట్‌గా కనిపిస్తున్నాయి. మరోవైపు పులివెందులలో చంద్రబాబు టూర్‌ని సక్సెస్‌ చేసేందుకు స్థానిక నేతలు ఇప్పటికే ప్లాన్‌ రెడీ చేసుకున్నారు. పులివెందుల రోడ్‌షో తర్వాత అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పర్యటిస్తారని, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు