Chandrababu Oath Taking: ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మరికాసేపట్లో అంటే.. ఈరోజు ఉదయం 11:27 నిమిషాలకు ఆయన ప్రమాణస్వీకారోత్సవం వేడుకగా జరగనుంది. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో పాటే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని కేసరపల్లిలో జరగనున్న ఈ వేడుక కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
అతిరథమహారధుల రాక..
Chandrababu Oath Taking: సర్వాంగసుందరంగా ముస్తాబయిన వేదిక నుంచి చంద్రబాబు.. ఆయన మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేయబోతోంది. దీనిని వీక్షించడానికి ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులు.. వివిధ రాష్ట్రాల సీఎంలు.. సినీనటులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మంత్రులు జేపీ నడ్డా, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరీ, జయంత్ చౌదరి, అనుప్రియా పటేల్, రామ్ దాస్ అథవాలే, వస్తున్నారు. ఇక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్ లతో పాటు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి పలువురు సీలబ్రిటీలు కార్యక్రమానికి వస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఎల్ఈడీలు.. ప్రత్యేక పార్కింగ్..
Chandrababu Oath Taking: గన్నవరం మండలంలోని కేసరపల్లి లో దాదాపు 12 ఎకరాల ప్రాంతంలో జరగనున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 36 గ్యాలరీలు.. అన్ని గ్యాలరీలో ఎల్ఈడీ స్క్రీన్స్ సిద్ధం చేశారు. వీఐపీల కోసం నాలుగు గేలరీలను ప్రత్యేకంగా కేటాయించారు. పరికింగ్ కోసం 56 ఎకరాలను కేటాయించారు. మొత్తం ఐదు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. సభావేదికకు.. పార్కింగ్ ప్రాంతానికి మధ్య 1.5 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ నుంచి కాలినడకనే సభా ప్రాంగణానికి చేరుకోవాలి. వీఐపీల కోసం సభాస్థలికి 300 మీటర్ల దూరంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
హై సెక్యూరిటీ..
Chandrababu Oath Taking: భారీస్థాయిలో ప్రముఖులు హాజరు కానుండడంతో అంతేస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. విజయవాడ సిటీలో 3 వేల మంది పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 60 మందికి పైగా ఐపీఎస్ లను నియమించారు. డీజీ హోదా నుంచి ఎస్పీ ర్యాంక్ వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
పాస్‌లు ఉంటేనే..
Chandrababu Oath Taking: సభాస్థలికి పక్కనే ఉన్న జాతీయరహదారిపై ట్రాఫిక్‌జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమానికి పాస్‌లు ఉన్నవారినే చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు. పాస్‌లు లేనివారిని రోడ్లపైకి అనుమతించబోమని విజయవాడ పోలీసు కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ చెబుతున్నారు. అలాగే సభకు వచ్చేవారు ఎటువంటి లగేజీ వారితో తెచ్చుకోవడానికి అనుమతించరు.
బెంగళూరు పూలతో..
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో వేదిక అలంకరణ పనులు జరిగాయి. భారీగా ఏర్పాటు చేసిన వేదికను వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. దీనికోసం బెంగళూరు నుంచి వివిధ రకాల పూలను తీసుకువచ్చారు.
మొత్తమ్మీద ఏపీలో చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.