Chandrababu: ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

చంద్రబాబు రిమాండ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినించగా.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.

New Update
Chandrababu: ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

Chandrababu: చంద్రబాబు రిమాండ్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినించగా.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సబబు కాదని లుథ్రా వాదించారు. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లుథ్రా వివరించారు. అలాగే 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరిచాలని గుర్తు చేశారు. శుక్రవారం రాత్రి 11.30గంటల నుంచి పోలీసులు చంద్రబాబును ముట్టడించారన్నారు. కనుక అప్పటి నుంచే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు భావించాలని కోరారు. నంద్యాలలో కోర్టు ఉండగా విజయవాడకు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబును పోలీసుల కాల్ రికార్డులను కోర్డులకు సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు చంద్రబాబు కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమమని.. రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.. స్కిల్ డెవలప్ మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో నిధులు కేటాయించామని.. దాన్ని రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని వాదించారు. 2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్ఐఆర్ లో తనపేరు లేదని.. అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ తన పాత్ర ఉందని సీఐడీ ఎక్కడా పేర్కొనలేదని బాబు తన వాదనల్లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్టు చేశారని చంద్రబాబు వెల్లడించారు.

కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 28 పేజీలతో రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించారు. అసలు స్కిల్ స్కామ్ ఎలా జరిగిందన్న విధానాన్ని సీఐడీ క్లియర్ గా వివరించింది. చంద్రబాబే కుట్రకు సూత్రధారి అంటూ సీఐడీ పేర్కొంది. ఇక ఈ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు తనయుడు లోకేష్ పేరును కూడా ప్రస్తావించారు. కిలారి రాజేశ్ ద్వారా లోకేశ్ కు డబ్బులు ముట్టాయని తెలిపింది.  సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మరోసారి స్వల్పవిరామం ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి కోర్టులో వాదనలు జరగుతున్నాయి. అటు ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఒకవేళ న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే ఆయనను నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు.

ఇది కూడా చదవండి: ఐపీసీ సెక్షన్ 409 అంటే ఏమిటి? చంద్రబాబుకు బెయిలా? జైలా?

Advertisment
Advertisment
తాజా కథనాలు