నవంబర్‌లోనైనా చంద్రబాబుకు రిలీఫ్‌ దక్కేనా? 8న క్వాష్‌ తీర్పు? - తెలకపల్లి రవి

కేసుల నుంచి చంద్రబాబుకు రిలీఫ్‌ దక్కుతుందా? కేంద్రం ఆశీస్సులు లేకుండా చంద్రబాబు అరెస్టు జరిగిందా? సిఐడి పెట్టిన సెక్షన్లు కూడా ముందస్తుకు అవకాశమిచ్చేలా లేవా? నవంబర్‌ 9న ఏం జరగబోతోంది? ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి అనాలసిస్‌ కోసం పైన హెడ్డింగ్‌ను క్లిక్ చేయండి.

నవంబర్‌లోనైనా చంద్రబాబుకు రిలీఫ్‌ దక్కేనా? 8న క్వాష్‌ తీర్పు? - తెలకపల్లి రవి
New Update
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్‌నెట్‌ స్కాం కేసులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు నవంబర్‌ తొమ్మిదో తేదీకి వాయిదా వేయడం ఊహించిన పరిణామమే. అప్పుడే ఇది ఒక కొలిక్కి రాబోదని మాత్రం అందరూ భావించారు. ఇప్పటి వరకూ ఎసిబి కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు మూడు చోట్ల కూడా న్యాయమూర్తుల ఆదేశాలు, స్పందనలూ ఆ విధమైన సంకేతాలిస్తున్నాయి. వాస్తవానికి మొదట్లోనైతే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్టు తర్వాత మాట్లాడుతూ కాస్త ముందు వెనకగా బెయిల్‌ వచ్చేస్తుందన్నట్టే వ్యాఖ్యానించారు. సిద్దార్థలూథ్రా వంటి ప్రసిద్ధ అడ్వకేట్‌ ఎసిబి కోర్టుకు వచ్చి వాదించాక ఇక తిరుగుండదని చాలామంది అనుకున్నారు. జగన్‌ ప్రభుత్వం ఆయన్ను పదమూడు రోజులైనా కస్టడీలో ఉంచాలని కక్షగా ఉందని, అది తీరిపోతే పర్వాలేదని లెక్కలేశారు. అయితే ఆ అంచనాలేవీ ఆచరణలో నిజం కాలేదు. ఈ క్షణంలోనైతే చంద్రబాబుపై ఉన్న కేసుల భవిష్యత్తు అనిశ్చితంగానే ఉంది. నవంబరు 9న కూడా విచారణ జరిగేది ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిలు గురించే. 8వ తేదీన క్వాష్‌ తీర్పు వస్తుందేమోనని ఒక అంచనా వుంది. రిజర్వు చేసిన తీర్పు వెలువరించాక ఈ ఫైబర్‌ కేసు తీసుకుంటే బావుంటుందని జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌ అనడం కూడా అందుకు అవకాశమిస్తోంది.
17(ఎ) సర్వరోగనివారిణి !?
తనను అరెస్టు చేస్తారని బహిరంగంగా చెబుతూ వచ్చిన చంద్రబాబు.. ముందస్తు కోసం ఎందుకు ప్రయత్పించలేదనే సందేహాలు, వాటికి చాలా సమాధానాలు ఉన్నాయి. క్రైం కేసు గనక బెయిలు రాదనే మాట ఒకటైతే, సిఐడి పెట్టిన సెక్షన్లు కూడా ముందస్తుకు అవకాశమిచ్చేలా లేవని న్యాయనిపుణులు కొందరు చెప్పారు. ఎసిబి కోర్టు కస్టడీ ఇచ్చాక కూడా బెయిల్‌ కాకుండా గృహ నిర్బంధం కోరారు. అది ఎలాగూ ఒప్పుకునేది కాదని తెలుసు. ఎసిబి కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లే బదులు క్వాష్‌ పిటిషన్‌ వేసి మొత్తంగా ఆయనను తప్పించాలని కోరారు. అందుకు సెక్షన్‌ 17(ఎ) సర్వరోగనివారణి అన్నట్టు వాదించారు సిద్ధార్థ లూత్రా. హైకోర్టులో అది వీగిపోయాక కూడా వ్యూహం మార్చకుండా సుప్రీం కోర్టులోనూ అదే కొనసాగిస్తున్నారు. ఇందులో బహుముఖ ప్రయోజనాలు ఉండొచ్చు. దీనిపై ఇప్పటికే చాలా చర్చ జరిగింది. తీవ్రమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 17(ఎ) కింద గవర్నర్‌ అనుమతి తీసుకోవడం అనేది నిజాయితీ పరుల కోసం ఏర్పాటు చేసిన ఒక ముందు జాగ్రత్త తప్ప అవినీతికి రక్షణ ఛత్రం ఏమీ కాదని ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గీ తదితరులు వాదించారు. 2018లో స్కిల్‌ కేసు విచారణ ప్రారంభించే నాటికి 17(ఎ) లేదని, అసలు నేరాలు జరిగాయంటున్నది 2015-16 సమయంలో గనుక అది అసలే వర్తించబోదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. హైకోర్టులో దీనిపై క్వాష్‌ను కొట్టివేసిన జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి కూడా ఆ వాదనతో ఏకీభవించారు.
ఎవరి వాదనలు వారివే..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికార విధి నిర్వహణలో భాగంగా చేసిన వాటిపై దర్యాప్తు చేసేప్పుడు తప్పక గవర్నర్‌ అనుమతి తీసుకుని ఉండాలని సిద్దార్థ లూథ్రా, హరీష్‌ సాల్వే వాదించారు. అనుమతి తీసుకోలేదు కనుక అరెస్టు తర్వాత రిమాండు ఉత్తర్వు చెల్లదనీ, అప్పుడు కేసు నిలవదనీ చెప్పారు. అయితే దీంతో చంద్రబాబుకు సంబంధం లేదంటూనే ఆయన విధి నిర్వహణలో భాగంగా చేశారని చెప్పడం ఎలా పొసుగుతుందని రోహత్గీ ఎదురు వాదన చేశారు. చంద్రబాబు మీద అవినీతి కేసులతో పాటూ ఐపిసి సెక్షన్లు కూడా ఉన్నాయి కనుక వాటి కోసమైనా ఎసిబి కోర్టు విచారించవలసి ఉంటుందని నొక్కి చెప్పారు. ఈ విచారణ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కేంద్రం ప్రారంభించింది కనుక కక్ష సాధింపు ఆరోపణకు అర్ధం లేదనీ ఆయన గుర్తు చేశారు. 17(ఎ)తో సమానమైన 6(ఎ) ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ యాక్ట్‌ (సిబిఐ) విషయంలో గతంలో సుప్రీం కోర్టు ఇదే తీర్పునిచ్చిందని ఉదహరించారు. 17(ఎ) సవరణ చేసేప్పుడు ఇది గతకాలానికి కూడా వర్తిస్తుందని నిర్దిష్టంగా పేర్కొనలేదని మరో వాదన తీసుకొచ్చారు. రఫేల్‌ కేసులో సుప్రీం కోర్టు స్వయంగా 17(ఎ) వెనకటి కాలానికి కూడా వర్తిస్తుందని చెప్పినట్టు సాల్వే చెబితే... అది కేవలం జస్టిస్‌ జోసఫ్‌ ఒక్కరి అభిప్రాయం మాత్రమేననీ, మిగిలిన ఇద్దరూ ఆ ప్రస్తావనే తేలేదని రోహత్గీ తెలిపారు. మొత్తంపైన ఉభయులనూ కూడా ధర్మాసనం రకరకాల ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టిన తర్వాత విచారణ వాయిదా వేసింది.
సాంకేతిక కోణం ఒక్కటే నిలవగలదా?
ఈ నేపథ్యంలో ఈ రోజు ముందస్తు బెయిల్‌ కేసు వచ్చినపుడు క్వాష్‌పై తీర్పు ఇచ్చిన తర్వాత దీన్ని వింటే బావుంటుందని జస్టిస్‌ బోస్‌ అన్నారు. అయితే అప్పటి వరకూ అరెస్టు చేయకుండా గతంలో ఉన్న అవగాహనను కొనసాగించాలని లూథ్రా కోరారు. ఇప్పటికే మరోకేసులో కస్టడీలో ఉన్న వారి విషయంలో మిగిలిన కేసులు కూడా అమలులోకి వస్తాయనీ, ముందుస్తు బెయిలు వర్తించే అవకాశమే ఉండదని ప్రభుత్వం తరపున రంజిత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. నవంబరు 8 వరకూ ఆగడానికి సిద్ధమే కానీ ఇప్పటికే వాటిపై ఎసిబి కోర్టులో విచారణ జరుగుతున్నదని తెలిపారు. ఈ క్రమంలో కేసు విచారణ వాయిదా పడింది. ఇరవై రోజుల పాటు చంద్రబాబు కస్టడీలోనే ఉండాల్సి రావచ్చు. ఈలోగా ఒక్క అవకాశం ఏమిటంటే ఆరోగ్యం విషయమై హైకోర్టు వెకేషన్‌ బెంచి కనుక ఏదైనా ఉపశమనం కలిగిస్తే ఆస్పత్రిలో చేరేందుకు వీలుంటుంది. ఈ కొద్ది రోజుల వ్యవధిలో వెకేషన్‌ బెంచి ఆ విధమైన వైఖరి తీసుకుంటుందా అనేది చూడవలసిందే. సాల్వే తన చివరి వాదనల్లో 17(ఎ) చంద్రబాబుకు మాత్రమే గాక స్కిల్‌ కేసు నిందితులైన అధికారులందరికీ వర్తిస్తుందని చెప్పడం, అది వర్తిస్తే ఇప్పటికి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం నిలవదని వాదించడం బహుశా సుప్రీం కోర్టు మరింత ఆలోచించడానికి కారణమై ఉండాలి. కేసు వివరాలు మొత్తం అవసరం లేదు గానీ పెద్ద స్కాం అంటూ ఒకటి జరిగినప్పుడు గజం మిథ్య పలాయనం మిథ్య అంటూ వదిలేస్తే ఎలా అన్నట్టు న్యాయమూర్తుల ప్రశ్నలుండటం గమనించవచ్చు. సాంకేతికంగా 17(ఎ) వర్తింపు గురించి రోహత్గీని కూడా అంతే నిశితంగా ప్రశ్నించారు న్యాయమూర్తులు. తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఎవరి అంచనాలు, ఆశలు వారికి ఉన్నా.. అవినీతి కేసుల పేరిట చాలా చోట్ల హడావుడి జరుగుతున్న పరిస్థితుల్లో దీన్ని కూడా తేలిగ్గా కొట్టివేయకపోవచ్చన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. బెయిల్‌ కోసం ప్రయత్నించకుండా 17(ఎ)ను పట్టుకుని ఉండాల్సింది కాదని, క్వాష్‌ ఈ దశలో చెల్లదని కూడా బలమైన అభిప్రాయాలున్నాయి. అంతేగాక చంద్రబాబు తదితరులపై మరికొన్ని కేసులు కూడా ఎదురు చూస్తున్నాయి. మధ్యలో లోకేశ్‌ హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయినా కేంద్రం తలదూర్చింది లేదు. నిజానికి కేంద్రం ఆశీస్సులు లేకుండా చంద్రబాబు అరెస్టు జరిగి ఉండదని అత్యధికుల భావన. ఏ విదంగా చూసినా.. న్యాయపరంగానూ, రాజకీయంగానూ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద సవాలు. అరెస్టులో కక్షసాధింపు తప్పయినా కోర్టులు విచారిస్తున్నందున వాటి తీర్పు కోసం చూడటం అనివార్యం.
తెలకపల్లి రవి

సీనియర్ జర్నలిస్ట్

రాజకీయ విశ్లేషకులు
#telakapalli-ravi-analysis
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe