New Rules For SIM Verification: కొత్త సిమ్ కార్డుల జారీకి సంబంధించి కేంద్రం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక నుంచి సిమ్ కార్డులు విక్రయించే డీలర్లు ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధనను తీసుకు వచ్చింది. డీలర్లకు బయోమెట్రిక్ (Biometric), పోలీసు వెరిఫికేషన్ (Police Verification) తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక నుంచి బల్క్ కనెక్షన్లు జారీ చేసే నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
కొత్త నిబంధనల గురించి కేంద్ర ఐటీ, టెలీకాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ministry of Electronics and Information Technology Minister Ashwini Vaishnaw)మాట్లాడుతూ..... ఇక నుంచి సిమ్ కార్డు విక్రయదారులకు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఒకే వ్యక్తి పేరుపై ఎక్కువ సిమ్ లను అమ్మే విధానం, నకిలీ సిమ్ కార్డుల విక్రయానికి ఈ నూతన మార్గదర్శకాల ద్వారా అడ్డుకట్ట వేయవచ్చి ఆయన పేర్కొన్నారు.
బ్లాక్ లిస్టులోకి 67వేల మంది డీలర్లు...!
నకిలీ ధ్రువ పత్రాల ద్వారా అక్రమార్గాల్లో పొందిన 52 లక్షల కనెక్షన్లను రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అక్రమార్కులకు ఈ కనెక్షన్లు అందించడంలో సహాయం చేసిన 67,000 మంది డీలర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు తెలిపారు. సైబర్ మోసాలకు పాల్పడిన కేసుల్లో వారిపై మొత్తంగా 300 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని వివరించారు.
సిమ్ కార్డు విక్రయదారులకు వెరిఫికేషన్ తప్పనిసరి...!
కొత్త నిబంధనల ప్రకారం సిమ్ కార్డు విక్రయదారులు పోలీస్, బయోమెట్రిక్ వెరిఫికేషన్స్ పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. దీంతో పాటు ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుందని సూచించారు. వెరిఫికేషన్ ప్రక్రియను టెలికాం ఆపరేటర్ల ద్వారా చేపట్టనున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై గరిష్టంగా రూ. 10 లక్షల జరిమానా విధించనున్నారు.
వెరిఫికేషన్ కు 12 నెలల గడువు...!
ఇప్పటికే ఉన్న సిమ్ కార్డు విక్రయదారులకు రిజిస్ట్రేషన్ నిబంధనను పాటించేందుకు కేంద్ర ప్రభుత్వం 12 నెలల గడువును ప్రకటించింది. ఈ లోగా విక్రయదార్లు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని సూచించింది. మోసపూరిత సిమ్ కార్డుల విక్రయదారులను గుర్తించి వారిని బ్లాక్ లిస్టులో పెట్టి, వారి ఆటకట్టించి కఠినమైన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రక్రియ సహకరిస్తుందని కేంద్రం వెల్లడించింది.
బల్క్ సిమ్ కార్డుల జారీ కుదరదు...!
గతంలో ఉన్న బల్క సిమ్ కార్డుల జారీ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు తాజాగా కేంద్రం ప్రకటించింది. దాని స్థానంలో బిజెనెస్ కనెక్షన్లు అనే నిబంధనను తీసుకు వచ్చింది. ఈ ప్రక్రియలో వ్యాపార సంస్థల నుంచి కేవైసీ ధ్రువీకరణ చేయనున్నారు. దీంతో పాటు సంస్థ నుంచి సిమ్ హ్యాండోవర్ చేసుకునే వ్యక్తి కి సంబంధించి కేవైసీ చేయనున్నట్టు చెప్పింది. ఇక సాధారణ వ్యక్తులు గతంలో లాగానే తొమ్మిది వరకు సిమ్ కార్డులు తీసుకోవచ్చని పేర్కొంది.
సిమ్ డిస్ కనెక్షన్....!
సిమ్ కార్డు డిస్ కనెక్ట్ అయిన తర్వాత 90 రోజుల్లో ఆ మొబైల్ నంబర్ ను కొత్త వ్యక్తికి జారీ చేయనున్నారు. ఒక వేళ పాత సిమ్ కార్డు స్థానంలో కొత్త సిమ్ కార్డు తీసుకోవాల్సి వస్తే అప్పుడు వినియోగదారుడు కేవైసీ (KYC) ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. ఆ సమయంలో 24 గంటల పాటు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ నిలిచి పోతాయని పేర్కొంది.
Also Read: అది కేంద్రం నిర్ణయించి రాష్ట్రాలపై విధించేది కాదు… ఎన్ఈపీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు….!