Lok Sabha Elections Schedule: లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందనే చర్చకు తెర పడనుంది. ముందుగా ఈ నెల 13న ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తుందని ప్రచారం జరగగా.. తాజాగా లోక్ సభ ఎన్నికలపై ఒక అప్డేట్ వచ్చింది. ఈనెల 15న ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ నెల 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. 14న పూర్తిస్థాయిలో మరోసారి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించి 15న షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ALSO READ: ముందు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ఏప్రిల్ 11న పోలింగ్..
ఈ మేరకు ఈ నెల 13న లేదంటే 14న ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉండగా.. 2024లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగబోతున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్లు ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బందికి సెలవులను రద్దు చేసిన కలెక్టర్లు.. 8, 9, 10 తేదీల్లో సెలవు పెట్టడానికి వీల్లేదంటూ ఆదేశాలు సైతం జారీ చేశారట. ఇక ఈ ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. రేవంత్ రెడ్డి సర్కారుతో పాటు రాష్ట్రంలోని పార్టీలు విస్తృత కార్యాచరణ మొదలుపెట్టగా.. ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కేడర్‌తో పరుగులు పెట్టిస్తున్నారు.
దేశమంతటా కోడ్ అమల్లోకి..
అలాగే ఈ షెడ్యూల్ జారీతో దేశమంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుండగా.. కేంద్ర, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోనున్నాయి. దీంతో చిన్న చిన్న ప్రారంభోత్సవాల రహస్యంగా పూర్తి చేస్తున్నారు నాయకులు. జిల్లాల స్థాయిలో పూర్తిచేయాల్సిన పనులపై కూడా దృష్టిపెట్టిన అధికారులు ఈనెల 12 కల్లా పెండిగ్ పనులన్నీ పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.