/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/rashi-khanna-4-1.jpg)
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, రాజకీయ నాయకుడు గాలి జనార్థన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆస్తులు, ఆయన భార్య గాలి అరుణ లక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేయాలని CBI కోర్టు ఆదేశించింది. 65 కోట్ల విలువైన గాలి దంపతులకు చెందిన 124 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్ట సవరణ చట్టం కింద 82 ఆస్తులను మాత్రమే జప్తు చేసేందుకు కోర్టు అనుమతించింది.
స్వాధీనం చేసుకోనున్న ఆస్తుల్లో 77 జనార్థన్ రెడ్డికి, 5 ఆయన భార్యకు చెందినవి. కర్ణాటక ఎన్నికలకు ముందు గాలి జనార్థన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతిపక్ష పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అప్పటికే అక్రమ మైనింగ్ కేసుల్లో బెయిల్ పై బయటకు వచ్చారు. బళ్లారికి వెళ్లకూడదంటూ కోర్టు షరతులు విధించింది.
కోర్టు షరతులు విధించడంతో ఆయన బెంగళూరుకే పరిమితమయ్యారు. మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్థన్ రెడ్డి గంగావతి నుంచి గెలుపొందగా.. ఆయన భార్య అరుణ బళ్లారి సిటీ స్థానంలో బీజేపీని మూడో స్థానానికి నెట్టారు. ప్రచారం సందర్భంగా గాలి జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ఐటీ దాడుల గురించి పెద్దగా పట్టించుకోనని పేర్కొన్నారు.