The Groundbreaker: కన్వల్ రేఖి 'ద గ్రౌండ్‌బ్రేకర్' పుస్తక ఆవిష్కరణ

'TiE' కో-ఫౌండర్ కన్వల్ రేఖి రచించిన 'ద గ్రౌండ్‌బ్రేకర్' బుక్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సత్వ నాలెడ్జ్ సిటీలోని 'ద కోరమ్'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TiE హైదరాబాద్ నూతన అధ్యక్షుడు మురళీ కాకర్ల ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

New Update
The Groundbreaker book release

సిలికాన్ వ్యాలీ దిగ్గజం, 'TiE' (ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్) కో-ఫౌండర్ కన్వల్ రేఖి రచించిన 'ద గ్రౌండ్‌బ్రేకర్' బుక్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సత్వ నాలెడ్జ్ సిటీలోని 'ద కోరమ్'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TiE హైదరాబాద్ నూతన అధ్యక్షుడు మురళీ కాకర్ల ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

గ్రామీణాల్లో యూత్ టాలెంట్

ఈ సందర్భంగా నిర్వహించిన 'ఎంట్రప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్, ఇంపాక్ట్' సెషన్‌లో రేఖి తన ప్రయాణంలోని అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల నిజామాబాద్‌లో తాను ప్రారంభించిన 'క్రెస్ట్' గురించి ఆయన ప్రస్తావించారు. "నిజామాబాద్‌లో నేను కలిసిన యువ గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఆలోచనల్లోగానీ, అమలు చేయడంలోగానీ ఎవరికీ తీసిపోరు. నిజమైన భారతం గ్రామాల్లోనే ఉంది, అక్కడ ప్రతిభకు కొదవలేదు" అని ఆయన కొనియాడారు. స్టార్టప్ వ్యవస్థలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

నాటి వాజ్‌పేయి నిర్ణయం.. నేటి ఆర్థిక వృద్ధి

గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో తనకున్న అనుబంధాన్ని రేఖి గుర్తుచేసుకున్నారు. ఐటీ కంటే ముందు టెలికాం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని తాను సూచించగా, వాజ్‌పేయి ఆ ప్రతిపాదనను అంగీకరించారని, ఆ నిర్ణయమే దేశ గమనాన్ని మార్చిందని తెలిపారు. ప్రస్తుతం భారత్ 7-8% వృద్ధి రేటుతో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలవడం గర్వకారణమని, పారిశ్రామికవేత్తలకు మరింత స్వేచ్ఛనిస్తే గ్లోబల్ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు.

శరణార్థిగా భారత్ వచ్చి

విభజన సమయంలో శరణార్థిగా భారత్ వచ్చి, ఐఐటీ బాంబేలో చదువుకుని, ఆపై అమెరికాలో 'ఎక్సెలాన్' వంటి దిగ్గజ సంస్థలను స్థాపించిన రేఖి జీవితం ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం. నెట్‌వర్కింగ్ రంగంలో TCP/IP వంటి ఓపెన్ స్టాండర్డ్స్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన జీవితంలోని ఒడిదుడుకులు, రిస్కులు మరియు విజయాలను 'ద గ్రౌండ్‌బ్రేకర్' పుస్తకంలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో రామ్ తల్లూరి, ఫణీంద్ర సామ (రెడ్‌బస్ ఫౌండర్), రాజు రెడ్డి (సియెర్రా అట్లాంటిక్ ఫౌండర్) వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, టీఐఈ సభ్యులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు