మహారాష్ట్రలోని బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై పెను ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడంతో 25 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బుల్దానా జిల్లా సింధ్‌ఖేదరాజా సమీపంలోని పింపాల్‌ఖుటా గ్రామ సమీపంలో సమృద్ధి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్యాసింజర్ బస్సు నాగ్‌పూర్ నుంచి పూణె వెళ్తోంది. ఈ ప్రమాదం అర్ధరాత్రి 2గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో నాగ్‌పూర్, వార్ధా, యవత్‌మాల్‌కు చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు విదర్భ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
సింధ్‌ఖేదరాజా సమీపంలోని పింపాల్‌ఖుటా గ్రామ సమీపంలో సమృద్ధి హైవేపై బస్సు రోడ్డు డివైడర్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి. డీజిల్ ట్యాంకుకు డివైడర్ తగలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికుల్లో 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న వారిలో డ్రైవర్, క్యారియర్ కూడా ఉన్నారు. మరోవైపు క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బస్సు ముందుగా ఇనుప స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సు రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. బస్సు డోర్ నుంచి ఎవరూ బయటకు రాలేకపోయారు. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చారు. పోలీసులు, సంఘటనా స్థలంలో ఉన్న సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు ముందుగా నాగ్‌పూర్-ఔరంగాబాద్ మార్గంలో కుడివైపున ఉన్న ఇనుప స్తంభాన్ని ఢీకొట్టింది.
బస్సు అదుపు తప్పి ట్రాఫిక్ దారుల మధ్య ఉన్న కాంక్రీట్ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. బస్సు ఎడమవైపు బోల్తా పడటంతో బస్సు డోర్ కిందపడిపోయింది. ఈ పరిస్థితుల్లో జనం బయటకు వచ్చేందుకు మార్గం లేకపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.