బుక్కపట్నం SRO శ్రీనివాస్ ది ఆత్మ'హత్యే' నా ?

శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం SRO శ్రీనివాస్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలోని మాధవాపురం ప్రాంతంలోని ఒక లాడ్జిలో శవమై వేలాడుతూ కనిపించాడు. అయితే, అతను ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, అతని మరణంపై కుటుంబసభ్యలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

New Update
బుక్కపట్నం SRO శ్రీనివాస్ ది ఆత్మ'హత్యే' నా ?

Ananthapuramu: శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42) జీవితం విషాదంగా ముగిసింది. చెన్నైలోని మాధవాపురం ప్రాంతంలోని ఒక లాడ్జిలో శవమై వేలాడుతూ కనిపించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా చంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల క్రితం బుక్కపట్నం రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం పై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడి జరిపింది. ఒక రిజిస్ట్రేషన్ కు సంబంధించి ముడుపులు తీసుకుంటూ శ్రీనివాస్ నాయక్ పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ శ్రీహరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ఊహించని రీతిలో నాయక్ తప్పించుకున్నారు. అతనిపై ఏసీబీ అధికారులు బుక్కపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజులకే చెన్నైలోని ఒక లాడ్జిలో విగతజీవిగా పడి ఉన్నట్టు లాడ్జి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుక్కపట్నం పోలీసులకు కూడా సమాచారం అందింది.. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.. శ్రీనివాస్ నాయక్ ది ఆత్మ "హత్యే" నా అన్న అనుమానాలు తాజాగా వినిపిస్తున్నాయి.. బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రం శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, అతని మరణం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి అనుమానాస్పద మరణమేనని వారు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Also read: వైసిపిది బీసీ యాత్ర కాదు.. బేవర్స్ బస్సు యాత్ర..మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్

ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జవాబు దొరకాల్సిన ప్రశ్నలు ఎన్నో కనిపిస్తున్నాయి..బుక్కపట్నం ఎస్ఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆధీనంలోనే ఉన్న శ్రీనివాస్ నాయక్ ఎలా తప్పించుకొని పారిపోయాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. కార్యాలయంలో పనిచేస్తున్న ఒకరు నాయక్ పారిపొమ్మని సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే అతను పారిపోయి బయటికి వచ్చే సమయానికి ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నట్లు, ఆ వాహనమే ఎక్కి శ్రీనివాస్ పారిపోయినట్లు తెలియ వచ్చింది. వాస్తవానికి అతనిని తీసుకెళ్లింది ఎవరు? ఎక్కడ వరకు ఆయనను తీసుకెళ్లాడు? ఎవరు సమాచారం ఇస్తే వాహనాన్ని ఆ వ్యక్తి సిద్ధంగా ఉంచుకున్నాడు? అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి? శ్రీనివాస్ నాయక్ చెన్నై కి ఒకరే వెళ్లారా? లేక ఆయన వెంట మరెవరైనా ఉన్నారా? ఆయన కారులో వెళ్లారా? బస్సులో వెళ్లారా? కారులో వెళ్లి ఉంటే ఆ కారు ఎవరిది? తీసుకెళ్ళింది ఎవరు? ఎవరెవరు ప్రయాణించారు? అన్నది తేలాల్సి ఉంది.

నిజంగా శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఉంటే పుట్టపర్తి లోని ఇంటిలో.. లేదా హిందూపురంలోని ఇంటిలో.. ఇది కాకపోతే మరోచోట ఆత్మహత్యకు పాల్పడే వాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆత్మహత్యకు అవసరమైన సరంజామా ను సిద్ధం చేసుకుని చెన్నై వెళ్లి ఒక లాడ్జిలో దిగి ఆత్మహత్య చేసుకోవాల్సిన సమస్యే ఉత్పన్నం కాదని ప్రచారం జరుగుతోంది.. ఆయన ది ఆత్మ"హత్యే" నా? కాదా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది..

ఇదిలా ఉండగా ఆయన తాను చెన్నై వెళుతున్నట్లు ఒక ఫోన్ నెంబర్ నుంచి కుటుంబ సభ్యులు ఒకరికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.. అయితే ఆ ఫోన్ నంబర్ ఎవరిది? అన్న అంశం కూడా వెలుగు చూడాల్సి ఉంది.. ఇదిలా ఉండగా కొందరు గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచినట్లు తెలియ వచ్చింది. పుట్టపర్తి లోని శ్రీనివాస్ నాయక్ నివాసం వద్ద కూడా వారు హల్ చల్ చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయాలన్న దానిపై బెదిరింపులు ఉన్నాయని, అందుకు ఆయన ససేమిరా ఒప్పుకోలేదని కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్క ఏసీబీ దాడి కారణంతోనే ఆయన మరణం సంభవించలేదని, అంతర్గతంగా ఇందుకు బలమైన కారణాలే ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ నాయక్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపాలని కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను ఆశ్రయించనున్నట్లు తెలిసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు