- హైదరాబాద్ చింతల్‌లో ఘటన
- జాకీలు పక్కకు జరగడంతో పక్క బిల్డింగ్ పైకి వాలిన బిల్డింగ్
- కూల్చేయాల్సిందే అంటున్న జీహెచ్ఎంసీ అధికారులు
- వరద నీటిని తప్పించే ప్రయత్నంలో ఇంటినే కోల్పోతున్న యజమాని
భాగ్యనగరంలోని చింతల్‌కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 ఏళ్ల కిందట శ్రీనివాస్‌నగర్ లో ఇల్లు కట్టుకున్నాడు. కాలక్రమంలో ఇంటి ముందున్న రోడ్డు ఎత్తు పెరగగా.. వర్షాకాలం వరద నీళ్లు ఇంట్లోకి చేరుతున్నాయి. ఈ ఏడాది వరద నీరు ఇంట్లోకి రాకుండా నాగేశ్వరరావు చర్యలు చేపట్టాడు. తన ఇంటిని ఎత్తు పెంచాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ కు ఈ పనులు అప్పగించాడు. పనులు కూడా మొదలు పెట్టారు. హైడ్రాలిక్ జాకీలతో ఇంటిని నెమ్మదిగా పైకి లేపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జాకీలు పక్కకు జరగడంతో ఇల్లు పక్క బిల్డింగ్ పైకి వాలింది.
జీ - ప్లస్ 2 విధానంలో నిర్మించిన ఈ భవనం మొత్తం పక్క బిల్డింగ్ పై వాలడంతో పక్క బిల్డింగ్ లో ఉంటున్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో శ్రీనివాసనగర్ చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు నాగేశ్వరరావు ఇంటిని పరిశీలించారు. ఇంటి ఎత్తు పెంచే క్రమంలో జాకీలు పక్కకు జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే మరమ్మతు పనులు చేపట్టడంతో నాగేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. నాగేశ్వరరావు ఇంటిని కూల్చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఆదివారం సాయంత్రంలోగా ఆయన ఇల్లు నేలమట్టం కానుంది. అయితే.. ఇదిలా ఉంటే.. తమకు మరో అవకాశం ఇస్తే బిల్డింగ్ ను సరిచేస్తామని నిపుణులు చెబుతున్నారు.